Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Telangana: అర్ధరాత్రి రోడ్డుపై 'లేడీ సింగం'.. పోకిరీలకు చుక్కలు చూపించిన ఐపీఎస్ సుమతి!

MAHAA News 2 weeks ago

Telangana: హైదరాబాద్‌ నగరంలో అర్ధరాత్రి వేళ ఓ మహిళ ఒంటరిగా రోడ్డుపై నిలబడితే పరిస్థితి ఎలా ఉంటుంది? సాయం చేసే చేతుల కంటే, వేధించే మృగాళ్లే ఎక్కువ ఉంటారని మరోసారి రుజువైంది.

మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ సుమతి, నగరంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆమె ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, ఒక సామాన్య మహిళలా వేషధారణ మార్చుకుని అర్ధరాత్రి దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ వద్దకు చేరుకున్నారు.

సుమారు మూడు గంటల పాటు ఆమె బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికురాలిలా అక్కడ నిలబడ్డారు. అయితే, అక్కడ ఆమెకు ఎదురైన అనుభవాలు షాకింగ్‌గా ఉన్నాయి. పోలీస్ కమిషనర్ అని తెలియని ఆకతాయిలు ఆమెను చుట్టుముట్టారు. “ఎంత తీసుకుంటావ్? వస్తావా?” అంటూ అసభ్యకరమైన ప్రశ్నలతో వేధించడం మొదలుపెట్టారు. కొందరు బైకులపై వచ్చి ఆమె ముందు ఆపుతూ వెకిలి చేష్టలు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ మూడు గంటల సమయంలో ఒక్క పోలీస్ పెట్రోలింగ్ వాహనం కూడా అటువైపుగా రాలేదు. దీంతో పోకిరీలు మరింత రెచ్చిపోయి ప్రవర్తించారు.

వేధింపులకు పాల్పడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువకులే ఉండటం గమనార్హం. వారంతా మద్యం, గంజాయి మత్తులో ఉండి ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. సమయం మూడున్నర అవుతుండగా.. అటుగా వచ్చిన ఒక బీట్ కానిస్టేబుల్ ఆమెను గుర్తించి సెల్యూట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. అక్కడ ఉన్నది సామాన్య మహిళ కాదు, సాక్షాత్తు పోలీస్ కమిషనర్ అని తెలియగానే ఆకతాయిల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అప్పటిదాకా వెకిలిగా మాట్లాడిన వారంతా ఒక్కసారిగా వణికిపోయారు.

ఈ ఆపరేషన్‌లో దాదాపు 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చిన సుమతి.. చదువు, కెరీర్ మీద దృష్టి పెట్టాలని, ఆడపిల్ల కనిపిస్తే సాయం చేయాలే తప్ప వేధించకూడదని హెచ్చరించారు. ఇలాంటి సాహసాలు చేయడం సుమతికి కొత్తేమీ కాదు, 2001లో కూడా ఆమె ఇలాగే మృగాళ్లకు బుద్ధి చెప్పారు. ఒక ఐపీఎస్ అధికారిణికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. మహిళల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఈ ఆపరేషన్ ద్వారా ఆమె నిరూపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News