Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

V. D. Satheesan: కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ ప్రమాణస్వీకారం

MAHAA News 6 days ago

V. D. Satheesan: కేరళ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 20 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ విజయంతో కేరళలో దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చింది. తిరువనంతపురంలో జరిగిన ఈ ఘనమైన కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా కేరళ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ వేడుకకు రావడం విశేషం.

కొత్త ప్రభుత్వంలో మంత్రిపదవుల కేటాయింపులు కూడా దాదాపు ఖరారయ్యాయి. ముఖ్యమంత్రి సతీశన్ తన వద్దే ఆర్థిక, ఓడరేవుల వంటి కీలక శాఖలను ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో సీనియర్ నేత రమేష్ చెన్నితాలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన హోం శాఖతో పాటు విజిలెన్స్ బాధ్యతలను అప్పగించనున్నారు. కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌కు రెవెన్యూ శాఖను కేటాయించాలని కూటమి నాయకులు నిర్ణయించారు.

వీడీ సతీశన్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే మొదలైంది. 1964లో కొచ్చి సమీపంలోని నెట్టూర్‌లో జన్మించిన ఆయన.. వృత్తిరీత్యా న్యాయవాది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సతీశన్, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించారు. నిబద్ధత గల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. 2001లో పరావుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుండి ఇప్పటివరకు వరుసగా ఆరుసార్లు అదే స్థానం నుంచి విజయం సాధించి రికార్డు సృష్టించారు.

ముఖ్యంగా 2021లో కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. గత పినరయి విజయన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, గోల్డ్ స్మగ్లింగ్ వివాదాలు, శాంతిభద్రతల వైఫల్యాలపై అసెంబ్లీలో సతీశన్ గట్టిగా పోరాడారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తెచ్చారు. ఆయన చేసిన ఈ పోరాటాలే కాంగ్రెస్ కూటమిని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి కారణమయ్యాయి. అందుకే ముఖ్యమంత్రిని ఎన్నుకునే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధిష్టానం అందరూ సతీశన్‌ వైపే మొగ్గు చూపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News