Warren Buffett: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (Warren Buffett) తన సుదీర్ఘ వాణిజ్య ప్రయాణంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
దశాబ్దాలుగా తాను స్వయంగా నిర్మించి, ప్రపంచ స్థాయి సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన బెర్క్‌షైర్ హాత్‌వే (Berkshire Hathaway) సంస్థ ఛైర్మన్ పదవి నుంచి ఆయన వైదొలిగారు. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. అయితే కంపెనీతో ఆయన అనుబంధం పూర్తిగా తెగిపోలేదని, ఇకపై 'ఛైర్మన్ ఎమెరిటస్' (Chairman Emeritus) హోదాలో కొనసాగుతూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా తన అపారమైన అనుభవం, సలహాలతో మార్గదర్శకత్వం అందిస్తారని స్పష్టం చేసింది.
నాయకత్వ మార్పు - సంస్థ కొత్త సారథులు..
బెర్క్‌షైర్ హాత్‌వే ఎప్పటినుంచో పక్కాగా రూపొందించిన నాయకత్వ వారసత్వ ప్రణాళిక (Succession Plan) ప్రకారమే ఈ అధికార మార్పిడి జరిగింది..వారెన్ బఫెట్ కుమారుడు హోవార్డ్ బఫెట్ (Howard Buffett) బెర్క్‌షైర్ హాత్‌వే నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 1993 నుంచే కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల్లో గ్రెగ్ ఏబెల్ (Greg Abel) కొనసాగుతారు. సంస్థ రోజువారీ కార్యకలాపాలు, వ్యాపార వ్యూహాలను ఆయనే నడిపిస్తారు. సూజన్ లిన్ డెకర్ సంస్థ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా తన సేవలను కొనసాగించనున్నారు.
అమెరికన్ వాణిజ్య చరిత్రలోనే అసమానమైన ప్రభావం..
ఈ చారిత్రక పరిణామంపై బోర్డు తరఫున సీఈఓ గ్రెగ్ ఏబెల్ స్పందిస్తూ.. “బెర్క్‌షైర్ హాత్‌వే పురోగతిపై, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వాటాదారుల (షేర్‌హోల్డర్ల)పై వారెన్ బఫెట్ చూపిన ప్రభావం అమెరికన్ వ్యాపార చరిత్రలోనే మరే ఇతర పారిశ్రామికవేత్తతోనూ పోల్చలేనిది. దశాబ్దాల పాటు ఆయన నిర్మించిన వ్యాపార విలువలు, నైతికతే సంస్థకు అసలైన మూలస్తంభాలు. కొత్త ఛైర్మన్ హోవార్డ్ బఫెట్ నాయకత్వంలో ఆ విలువలను మేము ముందుకు తీసుకెళ్తాం” అని కొనియాడారు.
నూతన ఛైర్మన్ హోవార్డ్ బఫెట్ నేపథ్యం..
హోవార్డ్ బఫెట్ 1999 నుంచి ‘హోవార్డ్ బఫెట్ ఫౌండేషన్’ అధినేతగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, పేదరిక నిర్మూలన, సంక్షోభాల నివారణ కోసం విస్తృతంగా పనిచేస్తున్నారు. ఆకలిపై పోరాటంలో భాగంగా ఐక్యరాజ్యసమితి (UN) వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా దాదాపు పదేళ్ల పాటు అంతర్జాతీయ స్థాయిలో సేవలందించిన అనుభవం ఆయనకుంది. పలు ప్రముఖ పబ్లిక్, ప్రైవేట్ సంస్థల బోర్డులలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 90 ఏళ్లకు పైబడిన వయసులోనూ విలువ ఆధారిత పెట్టుబడుల (Value Investing) ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇన్వెస్టర్లకు రోల్ మోడల్‌గా నిలిచిన వారెన్ బఫెట్.. ఛైర్మన్ బాధ్యతల నుంచి గౌరవప్రదంగా తప్పుకుని, బోర్డు స్థాయి మార్గదర్శకుడిగా కొనసాగడం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
