Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ గొంతు నాది కాదు

ఆ గొంతు నాది కాదు

అది నకిలీ వీడియో

ప్రాణం పోయినా పార్టీకి నష్టం కలిగించను

మహేష్ కుమార్ గౌడ్ నాకు సోదరుని వంటి వారు

నన్ను అప్రతిష్టపాలు చేసేందుకు జరిగిన కుట్ర

నకిలీ వీడియోపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాను

పిసిసి క్రమశిక్షణా కమిటీకి షబ్బీర్ అలీ వివరణ

మన తెలంగాణ/హైదరాబాద్‌ః "అది నకిలీ వీడియో, అది నా గొంతు కాదు.." అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ తేల్చి చెప్పారు. ఏఐసిసి నుంచి, పిసిసి క్రమశిక్షణా కమిటీ నుంచి నోటీసు అందుకున్న షబ్బీర్ అలీ 24 గంటల లోపే పిసిసి క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి వివరణ ఇచ్చారు. మూడు పేజీల వివరణ లేఖలో షబ్బీర్ అలీ తన బాధను వ్యక్తం చేశారు. తన ప్రాణం పోయినా పార్టీకి నష్టం కలిగించే పని చేయనని ఆయన పేర్కొన్నారు. పార్టీకి తాను ఎంతో నిబద్ధతతో ఉంటానని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించి, బలహీనపరిచేందుకు జరిగిన కుట్ర అని ఆయన ఆరోపించారు. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు ఆడియో రికార్డులను పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలూ నమ్మవద్దని ఆయన కోరారు.

తనను అప్రతిష్టపాలు చేసేందుకు నకిలీ వీడియో తయారు చేసి వైరల్ చేసిన వారిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన ఆ వివరణ లేఖలో పేర్కొన్నారు. తనకు పిసిసి క్రమశిక్షణా కమిటీ నుంచి లేఖ రాక ముందే నోటీసు ఇచ్చానని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. నకిలీ వీడియో సృష్టికర్త ఎవరు ?, ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? అనేవి త్వరలో బహిర్గతమవుతాయని ఆయన తెలిపారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై న్యాయపరంగా, చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

మా ఇద్దరి మధ్య విభేదాలకు కుట్ర

పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ తనకు సోదరుని వంటి వారని ఆయన తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్‌తో తనకు సుమారు 45 సంవత్సరాలుగా సాన్నిహిత్యం ఉందని ఆయన వివరించారు. మహేష్ కుమార్ గౌడ్‌కు వ్యతిరేకంగా తాను పల్లెత్తు మాట అనలేదని ఆయన పేర్కొన్నారు. ఇద్దరమూ అదేవిధంగా కలిసి ఉంటామని షబ్బీర్ అలీ తెలిపారు. తమ మధ్య మనస్పర్థలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.

ఏఐసిసి నుంచి షోకాజ్ రాలేదు..

ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ ఆదివారం "మన తెలంగాణ" ప్రతినిధితో మాట్లాడుతూ తనకు ఏఐసిసి నుంచి ఎటువంటి షోకాజ్ నోటీసు రాలేదని చెప్పారు. పిసిసి క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి నుంచి శనివారం రాగానే వెంటనే షోకాజ్ నోటీసు ఇచ్చానని తెలిపారు. తాను మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీలో వీర విధేయున్ని అని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా అందరు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించానని చెప్పారు. పార్టీలోగానీ, మంత్రిగా ఉన్నప్పుడు గానీ ఎన్నడూ తనపై ఎటువంటి అభియోగం లేదని షబ్బీర్ అలీ చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu