Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆమె వేసుకుంది గౌను కాదు.. తల్లి 'గర్భం'

ఆమె వేసుకుంది గౌను కాదు.. తల్లి 'గర్భం'

Miss Uganda

అందాల పోటీలో ఓ భామ ధరించిన గౌను ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఆ గౌనులో అంత ప్రత్యేకత ఉంది. తళుకుబెళుకుల డిజైన్‌తో, పొడవాటి గౌన్‌లో ర్యాంప్‌పై హొయలొలికించిందామె.

కానీ, ఆ వేదికపై ఆమె చూపించింది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు.. ఓ తల్లి ప్రసవ వేదన కథ. అమ్మ కాబోతున్న మహిళ మధుర క్షణాల్లో అపూర్వ ఘట్టాన్ని.. ఈ భూమ్మీదకు ఓ ప్రాణాన్ని తీసుకొచ్చే అద్భుతాన్ని ప్రతిబింబించిందీ గౌను. ప్రపంచ సుందరి పోటీల్లో ఉగాండా భామ ధరించిన ఈ డ్రెస్.. మాతృత్వపు గొప్పతనాన్ని చాటి చెప్పింది. ప్రతి తల్లి జీవన అద్భుతాన్ని ప్రతిబింబించేలా ఈ గౌనును తీర్చిదిద్దారు ఉగాండా డిజైనర్ కీషా అబ్దల్లా. 'లేయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌' పేరుతో రూపొందించిన ఈ డ్రెస్‌తో.. సీజేరియన్‌ చేయించుకునే మహిళల ప్రసవ వేదనకు సరికొత్త రూపమిచ్చారు.

ఈ గౌను వెనుక ఉన్న కథను ఆమె తన ఇన్‌స్టా పేజీలో రాసుకొచ్చారు. ''శరీరమే ఓ రిఫరెన్స్ అయితే.. ఫ్యాషన్ భాషగా మారితే.. ఇలాంటి అద్భతం అవిష్కృతమవుతుంది. ఓ మహిళ గర్భంలో ఉండే అసాధారణ ఏడు పొరలు ఇవి. మనం ఎక్కడి నుంచి వచ్చినా.. మన చర్మ రంగు ఎలా ఉన్నా సరే.. మనమందరం ఈ పొరలను దాటుకునే భూమ్మీదకు వస్తాం. సీజేరియన్‌ కాన్పులో ఉండే వివిధ దశలను ఈ గౌను ప్రతిబింబిస్తుంది. ఇక, ఈ వస్త్రాల్లోని కదలిక మాతృత్వంతో పాటు వచ్చే భావోద్వేగాలను, పరివర్తనను సూచిస్తుంది'' అని డిజైనర్ తన పోస్ట్‌లో వివరించారు.

మహిళ గర్భంలోని ఒక్కో పొరకు సూచికగా పీచ్‌, గోల్డ్‌, కోరల్‌, రెడ్‌, మెరూన్‌, బర్గండీ రంగుల్లో ఈ డ్రెస్‌ను తీర్చిదిద్దారు. వియత్నాంలో జరుగుతోన్న మిస్‌ వరల్డ్‌ పోటీల్లో 'మిస్‌ ఉగాండా' ట్రివియా ఎల్లీ ముహోజా ఈ గౌనును ధరించి ర్యాంప్‌పై నడిచారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన కళతో అంతర్జాతీయ వేదికపై గొప్ప సందేశాన్ని చాటిన ఈ డిజైనర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu