Thursday, 29 Oct, 5.37 pm మన తెలంగాణ

హోమ్
ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు

హైదరాబాద్ : నగరంలో చలి తీవ్రత పెరుగుతుండటంతో పాటు వరుసగా పండగలు వస్తుండటంతో కరోనా వైరస్ విజృంభించే అవకాశ ఉందని వైద్యశాఖ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవఖానలో ఉచితంగా ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులు మూడు నెల వరకు స్దానిక ప్రజలకు నిర్వహిస్తామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. గ్రేటర్‌లో 196 ఆరోగ్య కేంద్రాల్లో జూలై 11 నుంచి నిర్వహిస్తున్నట్లు, అదే తరహాలో సంక్రాంతి పండగవరకు పరీక్షలు నిర్వహించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులు సూచించడంతో సిబ్బంది సామాన్య ప్రజలకు టెస్టులు చేసేందుకు అందుబాటులో ఉంటున్నారు.నాలుగు నెలలుగా నగరంలో 6.80లక్షల మందికి ర్యాపిడ్ టెస్టులు చేసినట్లు, రోజుకు 50మంది రక్తనమూనాలు సేకరించి, ఆరగంటలో ఫలితాలు వెల్లడిస్తామంటున్నారు. దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలున్న వారు ఎక్కువ మంది వస్తే టెస్టుల సంఖ్య పెంచుతామని చెబుతున్నారు.

ఆదివారంతో పాటు సెలవు దినాల్లో కూడా విధుల్లో ఉంటామని, ప్రజలు లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రులకు రావాలని సూచిస్తున్నారు. పరీక్షలు చేసిన తరువాత పాజిటివ్ వస్తే చికిత్స అందిస్తామని,వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటే గాంధీ, టిమ్స్ ఆసుపత్రులకు తరలిస్తామని, సాధారణంగా ఉంటే హోంక్వారంటైన్‌లో వైద్య సేవలందిస్తామంటున్నారు.వచ్చే కాలం చలికాలం కావడంతో వైరస్ రెక్కలు కట్టుకుంటుందని, దీనికితోడు నగర ప్రజలు వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించడంలో కొంత నిర్లక్షం వహిస్తున్నారని, ఇష్టానుసారంగా రోడ్లపై తిరుగడంతోపాటు దుకాణాల సముదాయాల వద్ద గుంపులు చేరుతున్నారని,దీంతో కరోనా మరోసారి విశ్వరూపం దాల్చే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 10సంవత్సరాల లోపు పిల్లలు, 60ఏళ్లుపైబడిన వృద్దులు అత్యవసర పరిస్దితుల్లో బయటకు వెళ్లాలని, ఇంట్లోనే ఉండటం శ్రేయస్కరమని, 20నుంచి 50సంవత్సరాల మధ్య వయస్సు వారు అధికంగా కరోనా వ్యాధి బారినపడుతున్నారని, వీరు బయటకు వెళ్లితే ముఖానికి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలంటున్నారు.

మాస్కు అనేది మొదటి రక్షణ కవచం, ధరించకపోతే నేరం అందుకు జరిమానా విధించవచ్చు,బయటకు వెళ్లినప్పుడు వ్యక్తుల మధ్య భౌతికదూరం 6ఫీట్లు ఉండే విధంగా జాగ్రత్తలు వహించాలని పేర్కొంటున్నారు.పని ప్రదేశాల్లో సబ్బుతో చేతులు కడుక్కోవడానికి కావల్సిన వసతులు, సానిటైజర్ వినియోగించాలి.కొన్ని సందర్బాల్లో ప్లూ, ఇన్‌ప్లూయెంజా లక్షణాలు దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ముక్కుకారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, తలనొప్పి లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధ సమస్యలు, తీవ్ర మూత్రపిండ వ్యాధులు, తీవ్ర శ్వాస సమస్యలు క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇంట్లోనే ఉండాలి, అత్యవసరమైన ఆరోగ్య చికిత్సలకు తప్ప ఇతర ప్రయాణాలకు దూరంగా ఉంటే కరోనా నుంచి రక్షించుకోవచ్చని వైద్యులు వివరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu
Top