Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆత్మీయతకు అద్దం తెలంగాణ భాష

ఆత్మీయతకు అద్దం తెలంగాణ భాష

తెలంగాణ ఆత్మీయతకు.. అద్దం. తెలంగాణ భాష. తెలంగాణ యాస భాషను అవహేళన చేయడం వెక్కిరించడం అంటే.. తెలంగాణ సమాజాన్ని అవమానించడమే అవుతుంది. ఇటువంటి అనేక అవమానాలను తెలంగాణ గడ్డ ఆరు దశాబ్దాలుగా ఎదుర్కొన్నది.

నిజానికి తెలంగాణ యాసభాషలో జీవం ఉన్నది. ప్రతీ ఒక్కరినీ ప్రేమగా గుండెలకు హత్తుక్కొని గొప్ప భరోసా చెప్పినట్లుంటుంది. పరాయి వారిని సైతం చేరదీసే గొప్ప సంస్కృతి తెలంగాణది. తెలంగాణ ప్రజల నిస్వార్థ జీవన విధానంలో నుంచి పుట్టిందే ఈ భాష. తెలంగాణకు యాస భాషనే కిరీటం. తెలంగాణకు ఉన్న గొప్ప చరిత్ర అంతా యాస భాషలోనే కన్పిస్తుంది. ఏ స్వార్థం లేని జీవన విధానం నుంచి వస్తున్న తెలంగాణ స్వచ్ఛమైన సంపద తెలంగాణ యాసభాష. తెలంగాణ భాష అందరికీ సులువుగా అర్థం అయ్యేలా ఉంటుంది. అందరినీ తనవారుగా చేరదీసే గొప్పతత్వం తెలంగాణ గడ్డది.

అటువంటి తెలంగాణ గడ్డను హేళన, అవహేళనలతో ఆరు దశాబ్దాలుగా ఆగం చేస్తూ వచ్చారు. ఫలితంగా తెలంగాణ తరతరాల వారసత్వ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలంగాణ అస్తిత్వాన్ని అంతా అణచివేయబడింది. ఆ అణచివేతను తట్టుకోలేకనే ఆత్మగౌరవ బతుకుల కోసం మా సంస్కృతి, సాంప్రదాయాలు, పాలన కోసం ఉవ్వెత్తున ఉద్యమం సాగింది. బలవంతంగా కలిపిన ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాలను కలిపి తెలంగాణ అస్తిత్వాన్ని కనమరుగు చేస్తున్న తరుణంలో అస్తిత్వ పోరాటం జరిగి పరాయి ఆధిపత్యానికి ఇడుపు కాయితం ఇచ్చి ఇప్పుడు స్వేచ్ఛగా తెలంగాణ ప్రపంచ దేశాలలో తన అస్తిత్వాన్ని చాటుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ మీద ఇంకా కొందరి అవహేళనలు, వ్యంగ్యపు మాటలతో తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయాలనే కుట్రలు రోజురోజుకు ఎక్కువే అవుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ పుష్కర కాలంలో తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు, తెలంగాణ యాస భాష, తెలంగాణ ఆత్మీయత ఎందరికో ఆదర్శంగా, ఆత్మీయంగా నిలుస్తున్నది. తెలంగాణకు పేరు ప్రఖ్యాతలు వచ్చే ప్రతీ సందర్భాన్ని అవహేళనతో చూడడం పరిపాటిగా మారిపోయింది. ఈ మధ్య తెలంగాణలో అనేక చిత్రాలు ఇక్కడి యాస భాషతో తీస్తున్నారు.

అలా తీసిన సినిమాలకు ప్రజలనుంచి విశేష స్పందన వస్తుంది. ఒకప్పుడు సినిమాల్లో తక్కువగాచేసి చూపిన యాస భాషనే ఇప్పుడు గొప్పగామారి సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. అటువంటి తరుణంలోనే ఓ సాధారణ నటులతో 'ఇడుపు కాయితం' అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్భంగా తెలంగాణ భాషను అగౌరపరిచేలా ఆంధ్రలో డబ్బింగ్ చేస్తారా అంటూ వ్యంగ్యపు చేష్టలతో తెలంగాణ భాష గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ గడ్డ ఎంతో ఆత్మీయత కలిగినది. ఈ గడ్డకు చేరదీసే గొప్ప గుణమే తప్ప ఈసడించుకోవడం తెలియదు. అటువంటి తెలంగాణ భాషపట్ల చిల్లర వ్యాఖ్యలు చేయడం అంటే తెలంగాణ గడ్డను అవమానించడమే అవుతుంది. ఆరు దశాబ్దాలు తెలంగాణ భాష, యాష, బతుకు మీద, భవిష్యత్తు మీద దాడి చేశారు ఆంధ్రపాలకులు. అయినా తెలంగాణ గడ్డ తెగింపుతో అస్తిత్వాన్ని కాపాడుకొని మళ్లీ ఆత్మీయతను పంచుతూ గర్వంగా నిలబడుతుంది. అటువంటి తరుణంలో భిన్న రంగాలలో వస్తున్న మార్పులతోపాటు సినీ రంగంలో ఈ ప్రాంత ప్రజల ఆత్మీయత, ప్రేమానురాగాలకు అద్దం పట్టేలా సినిమాలు వస్తున్నాయి. అటువంటి సినిమాలను ప్రజలూ గొప్పగా ఆదరిస్తున్నారు.

అందుకే పెద్ద పెద్ద డైరెక్టర్లు, నిర్మాతలు సైతం ముందుకు వచ్చి సినిమాలను నిర్మిస్తున్నారు. అటువంటి తరుణంలో తెలంగాణ భాషను అవహేళనగా మాట్లాడడం నిజంగా దౌర్భగ్యం. తెలంగాణ భాషను వెక్కిరించడం అంటే తెలంగాణ సమాజాన్ని చిన్నచూపు చూడడమే అవుతుంది. సమాజంలో నివసించే వ్యక్తులు ఆదరించే సంస్కృతి, సంప్రదాయాలు, భాషతో ముడిపడిన బంధం. మనుషులను పరస్పరం గౌరవించుకునే సంప్రదాయం. ఆత్మీయతకు తెలంగాణ పెట్టింది పేరు. మానవత్వం కలిగిన నేల. ఈ నేలలో ఒకసారి తమ వారిగా భావిస్తే తన పొత్తిళ్లలో దాచుకుని ప్రేమను పంచే గుణం గల నేల. అటువంటి తెలంగాణ నేల అనేకమైన సంప్రదాయాలకు, సంస్కృతి అద్దం పట్టే విధంగా ఉంటుంది. అటువంటి తెగువగల నేల తెలంగాణ యాసభాషలతో గొప్ప బలగాన్ని సంపాదిస్తుంది. విభిన్నమైన ఆధునికతతో దూసుకెళ్ళే దేశాలు తమ మాతృభాషను గౌరవిస్తాయి.

అందుకే మన దేశంలోనూ అభివృద్ధికి భాషను జోడించాలి. కానీ ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లం లేకపోతే బతకడం కష్టమనే భావన ఏర్పరుస్తున్నారు. విదేశీ భాష అవసరమే కానీ అది ఉపాధి కోసమే అని గుర్తించుకోవాలి. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడక ముందు ఈ ప్రాంతం పేర్లను తెరమీద చూసుకునే అవకాశాలు తక్కువ. కానీ నేడు ఇక్కడి లోకేషన్లు, ఇక్కడి భాష కు, కిరీటం దక్కినట్లుంది. బలగం సినిమాలో కూడా ఇక్కడి సంప్రదాయాన్ని, సంస్కృతిని కళ్లకు కట్టినట్టు చూపారు. ప్రపంచంలో ఏ మూలన వెళ్లిన సంస్కృతి సంప్రదాయా లకు భారతదేశాన్ని గొప్పగా ఆదరిస్తారు. అంతటి విశిష్టమైన పేరు కలిగిన దేశంలో మన తెలంగాణలో మన భాషకు మరింత డిమాండ్ వచ్చేలా, ఆదరణ ఎప్పటికీ తగ్గకుండా ఉండకుండా ఉండేందుకు ఇటువంటి ప్రయోగాత్మకమైన చిత్రాలు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సంస్కృతి తరిగిపోకుండా కృషి చేయాలి. మాతృభాషను డిమాండ్ పెరిగేలా చేస్తున్నామంటే.. మన సంస్కృతి, సాంప్ర దాయాలకు మరింత ఆదరణ పెరిగేలా చేయడమే అని భావించాలి.

తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా కదిలించింది మన సాహిత్యమే. అటువంటి మన సాహిత్యానికి పేరొస్తే మన తల్లిని మనం గౌరవిం చుకున్నట్టే. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు మన వారసత్వ సంపద ఆ సంపదను రాబోయే తరాలకు పంచుతూ.. మరింత డిమాండ్ పెంచేలా కృషి చేయాలి. అలాగే తెలంగాణ యాస పట్ల, భాష పట్ల విషం చిమ్మేవారు తలదించుకునేలా మన ప్రాంతం గౌరవాన్ని మరింత పెంచాలి.. తెలంగాణ సినీ రంగంలో ఇప్పుడిప్పుడే కొత్త వారికి అవకాశాలతో.. ముందుకు వస్తున్న సందర్భంలో వెకిలి చేష్టల మాటలు మాట్లాడి.. తెలంగాణ భాష గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడేటోళ్ల నోళ్లు మూయించేలా అద్భుతమైన ప్రతిభను కనబరిచి మన భాషకు మరింత గొప్ప గౌరవాన్ని తెచ్చుకోవాలి..ఆ దిశగా సాహిత్యకారులు మరింత గొప్పగా కృషి చేయాలి. తెలంగాణ భాష అంటే ఆత్మీయతకు అద్దం.. అది అర్థం కాకపోవడం అంటే వారి అపరిపక్వతకు నిదర్శణంగా భావించాలి.

- సంపత్ గడ్డం

7893303516

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu