న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి (ఐరాస) తాజాగా విడుదల చేసిన ప్రపంచ పటంలో అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను భారత్‌చైనా సరిహద్దు వివాదానికి సంబంధించిన ప్రాంతాలుగా ప్రత్యేకంగా చూపించడం చర్చనీయాంశంగా మారింది.
'మ్యాప్‌ను సరిదిద్దండి' (కరెక్ట్ ది మ్యాప్) తీర్మానానికి భారత్ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆఫ్రికన్ యూనియన్ మద్దతుతో తీసుకొచ్చిన ఈ తీర్మానాన్ని ఐరాస సర్వసభ్య సమావేశం గత వారం ఆమోదించింది. ప్రపంచంలోని ప్రాంతాలను, ముఖ్యంగా ఆఫ్రికాను పటాల్లో మరింత ఖచ్చితంగా, సమానంగా చూపించాలన్నది దీని ఉద్దేశం. ఇది తప్పనిసరిగా అమలు చేయాల్సిన తీర్మానం కాకపోయినప్పటికీ.. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా బహుళపక్ష సంస్థలు ఉపయోగించే ప్రామాణిక పటాల్లో దీనిని అనుసరించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో జూలై 1న తొలిసారిగా ప్రచురించిన పటంలో అరుణాచల్‌ప్రదేశ్‌ను నాగాలాండ్ నుంచి వేరు చేసినట్లు చూపించారు. అరుణాచల్‌ప్రదేశ్ ప్రత్యేక ప్రాంతంగా, పశ్చిమాన అసోం, ఉత్తరాన చైనాతో సరిహద్దు కలిగి ఉన్నట్లు పటంలో కనిపిస్తోంది. అదేవిధంగా అక్సాయ్ చిన్‌ను కూడా ప్రత్యేక ప్రాంతంగా చూపిస్తూ.. పశ్చిమాన భారత్, తూర్పున చైనాతో సరిహద్దు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ మార్పులకు కారణం ఏమిటన్నది ఐరాస వెల్లడించలేదు.
జమ్మూకశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ను చుక్కల రేఖతో చూపించారు. ఈ రేఖ భారత్, పాకిస్థాన్‌లు అంగీకరించిన జమ్మూకశ్మీర్‌లోని సుమారు నియంత్రణ రేఖను సూచిస్తుందని పటానికి సంబంధించిన వివరణలో ఐరాస పేర్కొంది. జమ్మూకశ్మీర్ తుది హోదాపై ఇరు దేశాల మధ్య ఇంకా అంగీకారం కుదరలేదని స్పష్టం చేసింది.
టోగో.. ఆఫ్రికన్ దేశాల తరఫున ప్రవేశపెట్టిన 'మ్యాప్‌ను సరిదిద్దండి' తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. సమాన విస్తీర్ణాన్ని ప్రతిబింబించే పటాల రూపకల్పనను ప్రోత్సహించాలన్న మౌలిక సూత్రానికే తాము మద్దతు ఇచ్చామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ తీర్మానం ఏదైనా నిర్దిష్ట పటం, పట ప్రక్షేపణ విధానం లేదా దేశాల సరిహద్దుల చిత్రణను ఆమోదించినట్లు భావించరాదని తెలిపింది.
జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలతో సహా భారత సార్వభౌమ భూభాగాన్ని భారత్ అధికారిక పటం ప్రకారమే చూపించాలని విదేశాంగ శాఖ పేర్కొంది. సరిహద్దుల విషయంలో తప్పుదోవ పట్టించే లేదా వాస్తవానికి విరుద్ధమైన చిత్రణను భారత్ అంగీకరించదని స్పష్టం చేసింది.
కొత్త పటంలో అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను భారత్, చైనా సరిహద్దు హక్కుల మధ్య చూపించడంపై న్యూఢిల్లీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు అక్సాయ్ చిన్ కూడా భారత్‌లో అంతర్భాగమని న్యూఢిల్లీ ఎప్పటినుంచో స్పష్టం చేస్తోంది. అలాగే అరుణాచల్‌ప్రదేశ్ కూడా భారత భూభాగంలో అంతర్భాగమేనని భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ వస్తోంది.

