Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో భారత్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్

అమెరికాలో భారత్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్

న్యూఢిల్లీ : కొన్నేళ్లుగా పరారీలో ఉన్న భారత వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియాలను అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) అధికారులు తాజాగా అరెస్టు చేశారు.

హర్యానాకు చెందిన హిమాన్షు దేశ రాజధాని ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో హత్య, హత్యాయత్నం, దోపిడీ, అక్రమ ఆయుధాల రవాణా వంటి 18 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2020లో బాలల సంరక్షణ కేంద్రం నుంచి తప్పించుకొని విదేశాలకు పారిపోయాడు. అక్కడి నుంచే ఢిల్లీ ఎన్‌సిఆర్, హర్యానా, పంజాబ్‌ల్లో వందల మంది అనుచరులతో ఓ క్రిమినల్ నెట్‌వర్క్‌ను నిర్మించాడని అధికారిక వర్గాల సమాచారం.

2022లో హర్యానాలో ఒకే రోజు మూడు హత్యలు జరిగిన ఘటనతో అతడి పేరు తెరపైకి వచ్చింది. ఈ క్రమం లోనే 2023లో హిమాన్షుభావుపై ఇంటర్‌పోల్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతోపాటు ఢిల్లీ, హర్యానా, పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడి పేరు ఉంది. అయితే లారెన్స్ బిష్ణోయ్ గోల్డీబ్రార్ నెట్‌వర్క్‌లతో హిమాన్షు భావు గ్యాంగ్‌కు వైరం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక హర్యానాకు చెందిన నీరజ్ ఫరీద్ పురియా పైన 25కు పైగా క్రిమినల్ కేసులున్నాయి. ఇతడు కూడా హిమాన్షుభావు ముఠాతో కలిసే నేర కార్యకలాపాలు సాగిస్తున్నట్టు దర్యాప్తులో గుర్తించారు. ఎల్విప్ యాదవ్ ఇంటివద్ద జరిగిన కాల్పుల ఘటనలో నీరజ్ ప్రమేయం ఉన్నట్టు తేలింది. కాంగ్రెస్ నేత వికాస్ చౌదరి హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. ఫరీదాబాద్‌లో బీజేపీ నేత వినోద్ భాటిని డబ్బుకోసం బెదిరించి, ఆయన కార్యాలయంపై కాల్పులు జరిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను భారత్‌కు అప్పగించే విషయంపై అమెరికా అధికారులతో కేంద్ర ఏజెన్సీలు సంప్రదింపులు జరుపుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu