Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అపార్ట్‌మెంట్ యజమానుల హక్కులకు రక్షణ

అపార్ట్‌మెంట్ యజమానుల హక్కులకు రక్షణ

తెలంగాణలో అపార్ట్‌మెంట్ యజమానుల సంఘాల నిర్వహణ వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీవితకాల కష్టార్జితంతో ఇళ్లు కొనుగోలు చేసుకున్న వేలాది కుటుంబాలు ప్రతి నెలా నిర్వహణ కోసం డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ..

ఆ నిధుల వినియోగం, లెక్కలు, ఎన్నికలు, సంఘాల నిర్వహణలో తగినంత పారదర్శకత ఉండటం లేదు. ముఖ్యంగా సంఘాల రిజిస్ట్రేషన్ తర్వాత వారి ఫిర్యాదులపై చర్యలు తీసుకునే వ్యవస్థ లేదు.

అపార్ట్‌మెంట్ యజమానుల సంఘాల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆశ్రయిస్తే.. సంఘం సంబంధిత చట్టం ప్రకారం ఏర్పడిందని, దాని అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని అధికారులు చెబుతున్నారు. తనిఖీలు నిర్వహించలేమని, ఎన్నికలు జరపలేమని, సంఘం వ్యవహారాలపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని చెబుతూ బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని వారు వాపోతున్నారు. సంఘాల నమోదుకు రుసుములు వసూలు చేస్తున్న అధికారులు.. ఆ తర్వాత వాటి నిర్వహణలో తమ బాధ్యత ఏమిటో స్పష్టం చేయాలి కదా.

హైదరాబాద్‌లోని పలు అపార్ట్‌మెంట్ యజమానుల సమ్మతి లేకుండానే కొద్దిమంది వ్యక్తులు సంఘం పేరుతో కమిటీలు ఏర్పాటు చేసుకుని నెలనెలా నిర్వహణ రుసుములు వసూలు చేస్తున్నారు. నిర్వహణ నిధులపై లెక్కలు అడిగినా, ఖర్చుల వివరాలు కోరినా ప్రశ్నించే యజమానులపై ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

సంఘం వ్యవహారాలు అంతర్గత అంశాలని, న్యాయం కావాలంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. దీంతో ప్రతి చిన్న వివాదానికీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్ప సామాన్య యజమానికి మరో మార్గం ఉండటం లేదు. న్యాయవాది ఖర్చులు, కోర్టు రుసుములు, ఇతర వ్యయాలు మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, పదవీ విరమణ చేసిన వారు ఏండ్ల తరబడి వివాదాల చుట్టూ తిరగడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.

సహకార సంఘాల మాదిరిగానే అపార్ట్‌మెంట్ యజమానుల సంఘాలకూ స్పష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సంఘాల నిర్వహణలో ఎన్నికలు, ఆదాయ వ్యయాల లెక్కలు, లెక్కల తనిఖీ, ప్రత్యేక తనిఖీలు, విచారణ, వార్షిక నివేదికల సమర్పణ వంటి అంశాలకు స్పష్టమైన నిబంధనలు ఉండాలి. ప్రతి నెలా యజమానులు చెల్లించే నిర్వహణ రుసుముల వినియోగంలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలి.

అపార్ట్‌మెంట్ యజమానుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. ప్రస్తుత నమోదు వ్యవస్థలోనే సంఘాలపై పర్యవేక్షణ, లెక్కల తనిఖీ, విచారణ, ఎన్నికల నిర్వహణ, అవకతవకలపై చర్యలు తీసుకునేలా అధికారాలను స్పష్టంగా కల్పించాలని యజమానులు కోరుతున్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని అపార్ట్‌మెంట్ యజమానుల సంఘాలకు వర్తించేలా ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, ఎన్నికలు, లెక్కలు, తనిఖీలు, విచారణ, నిధుల వినియోగంపై స్పష్టమైన నిబంధనలు రూపొందించాలి. రిజిస్ట్రేషన్ చేయడం మాత్రమే కాకుండా.. యజమానుల హక్కులకు రక్షణ కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యత అనే విషయాన్ని విస్మరించకూడదు.

ఎన్ మల్లేష్ బాబు (సీనియర్ జర్నలిస్ట్)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu