కొత్త నిబంధనతో కేరళలో టెన్షన్.. అప్పడంలో తేమ 15 శాతానికి మించొద్దట!
తిరువనంతపురం: అప్పడం వేయగానే 'ఫట్' అంటూ పొంగి గుండ్రంగా మారితేనే అసలు మజా.
ప్లేట్‌లో అన్నం కంటే అప్పడం పెద్దగా కనిపిస్తేనే భోజనానికి ఒక రేంజ్! కానీ ఇకపై అప్పడం అలా విచ్చలవిడిగా పొంగుతుందా? అన్నదే కేరళలో హాట్ టాపిక్‌గా మారింది. కారణం.. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నిర్దేశించిన కొత్త నిబంధన. అప్పడంలో తేమ 15 శాతానికి మించకూడదు. దీంతో కేరళ అప్పడం తయారీదారులు.. 'అయ్యో! మా అప్పడాల పొంగే స్వేచ్ఛకు కూడా కత్తెర పడుతుందా?' అంటూ ఆందోళన చెందుతున్నారు.
అప్పడం పొంగడం వెనుక సైన్స్!
అప్పడం చూడటానికి చాలా సింపుల్. పప్పు, ఉప్పు, మసాలాలు.. ఎండబెట్టడం.. ఆ తర్వాత నూనెలో వేయించడం. కానీ నూనెలో పడగానే బెలూన్‌లా పొంగడం వెనుక మాత్రం సైన్స్ ఉంది. అప్పడంలో ఉండే తేమ వేడికి ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి ఒత్తిడి వల్ల అప్పడం పొంగుతుంది. అందుకే తేమ స్థాయి మారితే పొంగే తీరులోనూ మార్పు రావచ్చు.
అప్పడం ఇక పాపం చిన్నదైపోతుందా?
కేరళలో అప్పడం అంటే కేవలం సైడ్ డిష్ కాదు. సంప్రదాయ సద్యా భోజనంలో అరటి ఆకుపై అన్నం, కూరలు, పచ్చళ్లు, పాయసం మధ్య అప్పడానికీ ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అప్పడం మునుపటిలా పొంగకపోతే దాని రూపం మారుతుందేమోనన్న ఆందోళన. అయితే FSSAI ఉద్దేశం అప్పడం పొంగకుండా చేయడం కాదు. ఆహార భద్రత, నాణ్యతను కాపాడటమే లక్ష్యం. తేమ ఎక్కువగా ఉంటే నిల్వ సమయంలో నాణ్యత దెబ్బతినడంతో పాటు సూక్ష్మజీవుల పెరుగుదలకు అవకాశం ఉంటుంది.
ఆరోగ్యం ఒకవైపు.. పొంగుడు మరోవైపు!
కేరళవారికి మాత్రం ప్రశ్న సింపుల్..
'సార్.. భద్రత సంగతి సరే. కానీ అప్పడం వేయగానే మనస్ఫూర్తిగా పొంగాలి కదా!'
అప్పడంపై నిషేధం లేదు. తినొద్దని ఎవరూ చెప్పలేదు. కానీ ఇకపై అప్పడానికీ పొంగే విషయంలో ఒక 'లిమిట్' ఉండొచ్చన్నమాట!
కేరళ భోజనంలో అప్పడం ఉంటుంది.. కాకపోతే 'బెలూన్ అప్పడం' రోజులకి మాత్రం బ్రేక్ తప్పదు.

