మనతెలంగాణ/హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 'అర్నబ్' తుఫానుగా బలపడుతోంది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని తెలిపింది.
కాగా, తుఫాను ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 115-125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ ఒడిశా తీరాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.

