దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకుల ప్రధాన లక్షం సామాజిక సేవ. కానీ నిజంగా ఆ లక్షాలను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎంతవరకు నెరవేరుస్తున్నాయో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.
ప్రాంతీయ స్వభావాన్ని కోల్పోయి పట్టణ ప్రాంతాలపై దృష్టి పెడుతున్నాయి. నిరక్షరాస్యులను, బలహీన, బడుగు, గిరిజన వర్గాలను పురుగుల్లా చిన్నచూపు చూస్తున్నాయి. ఏదైనా అడిగితే చిరాకు పడుతున్నాయి. ఇలాంటి వాతావరణానికి తోడు సిబ్బంది కొరత, ఇంటర్నెట్ సేవలు సరిగ్గా లేకపోవడం, ఎటిఎంలు అందుబాటులో లేకపోవడం తదితర సమస్యలతో గ్రామీణ బ్యాంకులు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా లోని కియోంజర్ జిల్లా పట్నా బ్లాక్‌లోని డయానాలి గ్రామ గిరిజనుడు ఒడిశా గ్రామీణ బ్యాంక్ నుంచి ఎదుర్కొన్న చేదు అనుభవం గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపింది. జితూ ముండా అనే ఈ గిరిజనుడి సోదరి కలారా ముండా రెండు నెలల క్రితమే మరణించింది.
ఆమె ఖాతాలో ఉన్న రూ. 20,000 నగదును విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా ఆమె డెత్ సర్టిఫికెట్ లేదా చట్టపరమైన వారసుల పత్రాలు కానీ లేకుండా పనికి రాదని బ్యాంకు సిబ్బంది అడ్డుకోవడం సమస్యలను సృష్టించింది. నిరక్షరాస్యుడైన జితూ ఎన్నిసార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా పత్రాలు లేక ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి తన సోదరి సమాధి తవ్వి అస్థిపంజరాన్ని సంచిలో వేసుకుని, సుమారు 3 కి.మీ నడిచి బ్యాంకుకు ఏప్రిల్ 27న తీసుకు వచ్చాడు. 'ఇదిగో నా సోదరి చనిపోయినట్టు ధ్రువీకరణ' అన్నట్టు బ్యాంకు అధికారుల ముందు అస్థిపంజరాన్ని సాక్షంగా నిలబెట్టాడు. మరునాడు ఈ అస్థిపంజరం సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయి దేశం అంతా సంచలనం సృష్టించింది. కియోంజర్ జిల్లా యంత్రాంగంలో కంపరం పుట్టింది. ఆఘమేఘాల మీద డెత్ సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్లు ఒకే రోజులో వచ్చి పడ్డాయి. రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్‌డిసి) నేతృత్వంలో దర్యాప్తు మొదలైంది. బ్యాంకు లోని సిసిటివి ఫుటేజీని పరిశీలించారు. బ్యాంక్ అధికారుల లోపాలను సిసిటివి ఫుటేజీ ఎత్తిచూపింది.
అయితే దీనికి ఆడియో లేదు. అయినాసరే జితూ బ్యాంకులో ఎన్ని గంటలు నిరీక్షించాడో, క్యాషియర్‌ను, మేనేజర్‌ను కలుసుకోవడం, వారు చిరాకుపడుతూ ముఖం తిప్పుకోవడం ఇవన్నీ బయటపడ్డాయి. 'ఇది చాలా సిగ్గుచేటు. బ్యాంకులో కస్టమర్లు అందరికీ ఎటిఎం కార్డులు మంజూరు చేస్తున్నప్పుడు జితూ కుటుంబీకులకు ఎందుకు ఎటిఎం కార్డు మంజూరు చేయలేదో అర్థం కావడం లేదు' అని ఆర్‌డిసి ప్రశ్నించగా, నిరక్షరాస్యులకు, విధానాలపై పరిజ్ఞానం లేని వారికి ఎటిఎం కార్డులు కేటాయించడం లేదని బ్యాంకు వారు సర్దిచెప్పుకున్నారు. జితూ ముండా, ఆమె సోదరి కలారా ముండా ఎనిమిదిసార్లు బ్యాంకుకు వచ్చి రూ. 100 నుంచి రూ. 500 వరకు డ్రా చేయడం ఒడిశా గ్రామీణ బ్యాంకు అధికారులకు తెలుసు. అయితే జితూ ముండా ఒకడే వచ్చి ఒకేసారి రూ. 20,000 డ్రా చేయాలని ప్రయత్నించేసరికి బ్యాంకు అధికారులు బాధ్యత తీసుకోవలసి వచ్చిందని దర్యాప్తు అధికారి ఆర్‌డిసి వెల్లడించారు. డెత్ సర్టిఫికెట్ కోసం ఆస్పత్రికి అఫిడవిట్ సమర్పించవలసిన అవసరం లేకున్నా అఫిడవిట్‌తో మార్చి 30న దరఖాస్తు చేయడమైంది. ఏప్రిల్ 4 నాటికే డెత్ సర్టిఫికెట్ జారీ కావలసి ఉన్నా కాలేదు.
దురదృష్టకర సంఘటన జరిగాక డెత్ సర్టిఫికెట్ జితూ ముండాకు అందిందని ఆర్‌డిసి వెల్లడించడం గమనార్హం. బ్యాంకు వ్యవహారాలు, విధానాలు తెలియని వారికి సహాయం అందేలా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయవలసి ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపిస్తానని ఆర్‌డిసి వెల్లడించారు. దీన్ని బట్టి గ్రామీణ బ్యాంకుల వ్యవహారాలు ఎలా సాగుతున్నాయో స్పష్టమవుతోంది. గ్రామీణ బ్యాంకుల వైఫల్యం వల్లనే రైతులకు రుణాలు సకాలంలో మంజూరు కావడం లేదు. ముఖ్యంగా రబీ సీజన్‌లో ఈ పరిస్థితి ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థల వైఫల్యాలు ఎక్కువగా ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు బ్యాంక్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లో రూ. 590 కోట్ల భారీ మోసం గత ఫిబ్రవరిలో బయటపడింది. హర్యానా ప్రభుత్వానికి చెందిన ఖాతాలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి బ్యాంక్ మాజీ ఉద్యోగి ఒకరు మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు కస్టమర్ల ఖాతాల నుంచి రూ. 16 కోట్లు కాజేసి షేర్‌మార్కెట్, క్రిప్టో, ఆన్‌లైన్ గేమ్‌లో పెట్టుబడి పెట్టినట్టు 2025 అక్టోబర్‌లో తేలింది. భారతీయ రిజర్వుబ్యాంక్ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ మోసాల విలువ మూడు రెట్లు పెరిగి రూ. 36,014 కోట్లకు చేరిందంటే ఆలోచించాల్సిందే. ఇదిలా ఉండగా సైబర్ నేరాల ముఠాలతో బ్యాంకర్లు కొందరు చేతులు కలపడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా సామాన్యులను కాపాడవలసిన బ్యాంక్ అధికారులే వారితో చేతులు కలిపి మోసాలకు పాల్పడుతున్న ఉదంతం హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ఏడుగురు బ్యాంక్ అధికారులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం అనుమానాస్పద లావాదేవీలను నిషేధించాల్సిన బాధ్యతను వీరు పూర్తిగా విస్మరించారు. ఈ ముఠాల కారణం గానే ఎంతోమంది అమాయకులు తమ కష్టార్జితాన్ని కోల్పోవలసి రావడం అత్యంత శోచనీయం

