ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిఎన్‌జి కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. తక్కువ మెయింటనెన్స్ ఖర్చులు, అద్భుతమైన మైలేజ్ కారణంగా చాలా మంది వినియోగదారులు సిఎన్‌జి మోడళ్లను ఎంచుకుంటున్నారు.
ముఖ్యంగా, ప్రతిరోజు ఎక్కువ దూరం ప్రయాణించే వారికి సిఎన్‌జి కార్లు చాలా పొదుపుగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో తక్కువ బడ్జెట్‌లో నెలవారీ ఇంధన ఖర్చులను తగ్గించే కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే మార్కెట్లో అనేక అద్భుతమైన సిఎన్‌జి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా వంటి కంపెనీలు ఒక కిలోగ్రామ్ సిఎన్‌జికి 30 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తాయి. ప్రస్తుతం మైలేజ్ విషయంలో అగ్రగామిగా ఉంటూ, వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందిన ఐదు కార్లు ఏమిటో చూద్దామా?
అత్యధిక మైలేజీనిచ్చే సిఎన్‌జి కార్ల విషయానికి వస్తే, మారుతి సుజుకి అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీకి చెందిన సెలెరియో సిఎన్‌జి 34.43 కి.మీ/కేజీ వరకు మైలేజీని అందిస్తూ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత వాగన్ఆర్ సిఎన్‌జి 33.47 కి.మీ/కేజీ మైలేజీతో రెండవ స్థానంలో ఉంది. కొత్త డిజైర్ సిఎన్‌జి కూడా 33.73 కి.మీ/కేజీ వరకు ఆకట్టుకునే మైలేజీని అందిస్తుంది. ఈ కార్లు తక్కువ ఇంధన వినియోగం, విశాలమైన క్యాబిన్, అద్భుతమైన పనితీరును కలిగి ఉంటాయి. అందుకే టాక్సీ ఆపరేటర్ల నుండి కుటుంబ వినియోగదారుల వరకు అన్ని వర్గాలలో వీటికి అధిక డిమాండ్ ఉంది.
మారుతితో పాటు, మైలేజ్ విషయంలో హ్యుందాయ్, టాటా కూడా బలమైన పోటీదారులుగా నిలిచాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సిఎన్‌జి సుమారు 28.5 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుంది. ఇది దాని ప్రీమియం ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. టాటా టియాగో ఐసిఎన్‌జి సుమారు 28 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుంది. ఈ టాటా కారు భద్రత విషయంలో కూడా చాలా పటిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రెండు మోడళ్లు వినియోగదారులకు ఆధునిక ఫీచర్లు, మంచి సౌకర్యం, తక్కువ మెయింటనెన్స్ ఖర్చుల ప్రయోజనాలను అందిస్తాయి.

