దేశ రాజధాని ఢిల్లీలోని ఐదు అంతస్తుల భవనం కుప్పకూలి ఏడుగురు మృతి చెందడం, పలువురు గాయపడటంపై ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది అత్యంత దురదృష్టకమని పేర్కొంది. ఇంతటి విషాదానికి భవంతి యజమానులే కాకుండా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ), ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) కూడా బాధ్యత వహించాలని కోర్టు తెలిపింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు తగినంత వసతి సౌకర్యాలు కల్పించడంలో డీయూ విఫలమైందని, దీంతో వారు ప్రైవేట్ పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతులను ఆశ్రయించాల్సింది వస్తోందని తప్పుపట్టింది. ఢిల్లీలో ఇలాంటి పీజీల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యపై వేర్వేరుగా వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఎంసీడీ, డీయూలకు నోటీసులు ఇచ్చింది. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించింది. మానవ ప్రాణాలను కాపాడేందుకు సహాయక చర్యల్లో రెట్టింపు ప్రయత్నాలను చేయాలని సూచించింది.
భవనం కూలిన ఘటనకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిఐఎల్)పై ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారంనాడు తక్షణ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా భవంతి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్, ఎంసీడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వం పరిస్థితిని నిరంతర పర్యవేక్షిస్తోందని, మరికొంత సమయం అవసరమని విన్నవించారు. అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటారని కోర్టుకు హామీ ఇచ్చారు. దీంతో ఈ పిటిషన్‌కు సంబంధించి అధికారులు తమ సమధానాలను 10 రోజుల్లోగా దాఖలు చేయాలని కోర్టు ఆదేశిస్తూ, తదుపరి విచారణను సెప్టెంబర్ 25వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీలోని సత్యనికేతన్‌లో డీయూ సౌత్ క్యాంపస్ సమీపంలో బాలుర కోసం నిర్వహిస్తున్న పేయింగ్ గెస్ట్ వసతి ఉన్న భవనం మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఆదివారం కూలిపోయింది.

