భోపాల్: మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కనీలో నిలబడి గుట్కా ఉమ్మివేస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో వృద్ధుడు మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఛతర్‌పూర్ చెందిన ప్రభూ లాల్ గుప్తా గత పదేళ్లుగా గంజ్‌బసోడాలో అద్దె ఇంట్లో నివసిస్తూ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం మూడో అంతస్తు బాల్కనీలో నిలబడి గుట్కా ఉమ్మివేస్తుండగా ప్రమాదవశాత్తు పక్కనే వెళ్తున్న 11 కేవీ హైటెన్షన్ లైన్ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో విద్యుత్ శాఖపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లకు అతి సమీపంలో ప్రమాదకరంగా వెళ్తున్న హైటెన్షన్ వైర్లను తొలగించాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన భవన యజమాని పద్మ చిదర్ మాట్లాడుతూ, "తన ఇంటి పక్క నుంచి వెళ్తున్న హైటెన్షన్ లైన్‌ను తొలగించాలని విద్యుత్ కంపెనీ అధికారులను పలుమార్లు కోరాను, వారు త్వరలో తొలగిస్తామని హామీ ఇచ్చారు, కానీ చాలా కాలమైనా చర్యలు తీసుకోలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రభూ చనిపోయాడని వాపోయాడు.

