Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బైక్‌ల మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్‌ జోరు

బైక్‌ల మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్‌ జోరు

2-3 ఏళ్లలో ఈ-బైక్‌ల వాటా 20 శాతానికి.. అల్ట్రావైలెట్‌ అంచనా

రూ.779 కోట్లతో కొత్త ప్లాంట్‌.. ఏటా 5 లక్షల వాహనాల ఉత్పత్తి లక్ష్యం

ముంబై, మన తెలంగాణ : దేశీయ మోటార్‌సైకిల్‌ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ బైక్‌ల హవా వేగంగా పెరుగుతోంది.

రాబోయే 2-3 ఏళ్లలో మొత్తం మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్‌ బైక్‌ల వాటా 20 శాతానికి చేరుతుందని బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సంస్థ అల్ట్రావైలెట్‌ ఆటోమోటివ్‌ అంచనా వేసింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు సంస్థ సిద్ధమవుతోంది.

రూ.779 కోట్ల పెట్టుబడి

తమిళనాడులోని హోసూర్‌ సమీపంలో కొత్త తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు రాబోయే ఐదేళ్లలో రూ.779 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త ప్లాంట్‌ తొలి దశలో ఏటా 2.5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఉంటుంది. భవిష్యత్తులో దీనిని 5 లక్షల యూనిట్లకు పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న 50-60 వేల యూనిట్ల సామర్థ్యంతో కలిపి 2-3 ఏళ్లలో మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 లక్షల యూనిట్లకు, ఐదేళ్లలో 5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రూ.2 లక్షలలోపే కొత్త బైక్‌లు

ప్రస్తుతం F77, X47 మోడళ్లను విక్రయిస్తున్న సంస్థ.. త్వరలో షాక్‌వేవ్‌ మోటార్‌సైకిల్‌, టెస్సెరాక్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. రాబోయే రెండేళ్లలో మోడళ్ల సంఖ్యను ఆరుకు పెంచనుంది. కొత్త మోడళ్ల ధరలు రూ.2 లక్షలలోపే ఉండేలా చూస్తున్నామని కంపెనీ కో-ఫౌండర్‌, సీటీఓ నీరజ్‌ రాజ్‌మోహన్‌ తెలిపారు. కొత్త మోడళ్ల రాకతో నెలకు 10 వేల యూనిట్ల విక్రయాలను సాధించగలమని సంస్థ ఆశిస్తోంది.

విదేశీ మార్కెట్లపైనా కన్ను

ప్రస్తుతం 20 యూరోపియన్‌ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అల్ట్రావైలెట్‌.. తదుపరి దశలో ఉత్తర అమెరికా, లాటిన్‌ అమెరికా మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. స్కూటర్ల విభాగంలో మొదలైన ఎలక్ట్రిక్‌ మార్పు ఇప్పుడు మోటార్‌సైకిళ్ల విభాగానికీ విస్తరిస్తోందని కంపెనీ సీఈఓ నారాయణ్‌ సుబ్రమణ్యం తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పెరుగుతున్న ఇంధన ధరలు, వినియోగదారుల మారుతున్న అభిరుచులు ఎలక్ట్రిక్‌ బైక్‌లకు డిమాండ్‌ను పెంచుతున్నాయని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu