Dailyhunt
బెంగళూరు దూకుడు..

బెంగళూరు దూకుడు..

బెంగళూరు: ఐపిఎల్19లో డిఫెండింగ్ ఛాం పియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) అసాధారణ ఆటతో అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఘన విజయాలు సాధించి ప్రత్యర్థి జట్లకు గట్టి సవాల్ విసురుతోంది.

తొలి మ్యాచ్‌లో పటిష్టమైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. తాజాగా మరో బలమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారీ విజయాన్ని అందుకొంది. రెండు మ్యాచుల్లో గెలిచిన బెంగళూరు టైటిల్ ఫేవరెట్‌లలో ఒకటిగా కనిపిస్తోంది. ఒకప్పుడూ బెంగళూరు టీమ్ అంటే అనిశ్చితి ఆటకు మరో పేరుగా చెప్పుకునే వారు.

కానీ కిందటి సీజన్ చివరి నుంచి జట్టు ఆటలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. 2025లో ప్రతికూల పరిస్థితులను సయితం తట్టుకుంటూ ట్రోఫీ సాధించి ఐపిఎల్‌లో నయా చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బెంగళూరు ఏకంగా ఐపిఎల్ విజేతగా నిలిచి ఔరా అనిపించింది. ఈ సీజన్‌లో జట్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఆర్‌సిబి కూడా దానికి తగినట్టుగానే తన ఆట తీరును మార్చుకుంది. తొలి మ్యాచ్‌లో 200కి పైగా భారీ స్కోరును అలవోకగా ఛేదించింది. తాజాగా చెన్నైతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ 250 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. జట్టులోని ప్రతి ఆటగాడు తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంతో బెంగళూరుకు ఎదురు లేకుండా పోతోంది. రానున్న రోజుల్లోనూ కూడా ఇలాంటి ఆటనే కనబరచాలనే పట్టుదలతో ఆర్‌సిబి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu