న్యూఢిల్లీ: భారత వైమానిక దళంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సాయుధ దళాల్లో ఎయిర్ వైస్ మార్షల్ లేదా దానికి సమానమైన హోదాను పొందిన మొట్టమొదటి మహిళ అధికారిగా (వైద్యేతర విభాగంలో) ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ నిలిచారు.
వాయుసేన ఈ మేరకు 'ఎక్స్' వేదికగా పోస్ట్ పెట్టింది. మంగళవారం ఢిల్లీలోని ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (విద్య)గా బాధ్యతలు స్వీకరించారని తెలిపింది. గతంలో ఆమె ఎయిర్ కమోడోర్ హోదాలో ఉండేవారని పేర్కొంది.
శక్తి శర్మ 1994లో ఐఎఎఫ్ విద్యా విభాగంలో నియమితులయ్యారు. వైమానిక దళ శిక్షణా సంస్థలు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్ క్వార్టర్స్, ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌లలో విభిన్న బాధ్యతలు నిర్వర్తించారు. ఐఐటి కాన్పుర్, పుణె విశ్వవిద్యాలయంలో 'ఐఎఎఫ్ చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్'ను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. త్రివిధ దళాల నుంచి సైనిక పాఠశాలకు ప్రిన్సిపల్‌గా పని చేసిన మొదటి మహిళ అధికారిగానూ గతంలో చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలతో ఆమె అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారని వాయుసేన తెలిపింది.

