తొలి ప్రాధాన్య కేటగిరీ వీసాలపై కోటా ఆంక్షలు
సెప్టెంబర్ 30లోపు కోటా పూర్తయ్యే అవకాశం
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు మరో ఎదురుదెబ్బ తగలనుంది.
అత్యంత ప్రతిభావంతులైన నిపుణులు, ప్రొఫెసర్లు, పరిశోధకులు, బహుళజాతి సంస్థల ఉన్నతస్థాయి నిర్వాహకులకు వర్తించే ఉద్యోగ ఆధారిత తొలి ప్రాధాన్య కేటగిరీ వీసా కోటా సెప్టెంబర్ 30లోపు పూర్తయ్యే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. అధిక డిమాండ్ కారణంగా భారతదేశానికి కేటాయించిన వార్షిక పరిమితి ముగింపు దశకు చేరిందని ఈ నెల వీసా బులెటిన్‌లో పేర్కొంది.
సెప్టెంబర్‌లో భారతీయులకు ఈ కేటగిరీకి సంబంధించి అక్టోబర్ 15 ఆఖరు తేదీ. అంటే ఆ తేదీ కంటే ముందు ప్రాధాన్య తేదీ ఉన్న దరఖాస్తుదారులకే ప్రస్తుతం వీసా సంఖ్య అందుబాటులో ఉంటుంది. అమెరికా చట్టం ప్రకారం ఉద్యోగ ఆధారిత వలస వీసాల్లో ఒక్క దేశానికి సాధారణంగా 7 శాతానికి మించి కేటాయించరు. భారతీయ దరఖాస్తుదారుల సంఖ్య అధికంగా ఉండటంతో భారీ రద్దీ, నిరీక్షణకు దారి తీస్తోంది. ఇతర కేటగిరీల్లోనూ భారతీయులకు పరిస్థితి క్లిష్టంగానే ఉంది.
ఉద్యోగ ఆధారిత రెండో ప్రాధాన్య కేటగిరీ సెప్టెంబరులో అందుబాటులో లేదు. పెట్టుబడిదారులకు సంబంధించిన ఐదో ప్రాధాన్య కేటగిరీ సాధారణ విభాగం కూడా అందుబాటులో లేదు. తొలి ప్రాధాన్య కేటగిరీ వార్షిక కోటా పూర్తయితే సెప్టెంబర్ 30 వరకు కొత్త వీసా సంఖ్యల జారీ తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. అక్టోబర్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత కొత్త వార్షిక కేటాయింపులు అందుబాటులోకి వస్తాయి. అయితే అప్పటి ప్రాధాన్య తేదీల్లో మార్పులు ఎలా ఉంటాయన్నది అక్టోబర్ వీసా బులెటిన్‌లో స్పష్టమవుతుంది.

