మన తెలంగాణ/హైదరాబాద్: "జెన్ జీ సునామీ ఇంతటి తో ఆగవద్దు.. పోలీసుల లాఠీఛార్జిలకు, తూటాలకు అదరకుండా, బెదరకుండా ఎదురొడ్డి నిలిచినందుకే ప్రధాని నరేంద్ర మోడీ తల వంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారు.." అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ ఘటనల్లో తీవ్రంగా గాయపడిన విద్యార్థులకు మద్దతుగా పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్ అధ్వర్యంలో సాయంత్రం నెక్లెస్ రోడ్డు పీపు ల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా విద్యార్థులూ పెద్ద సంఖ్యలో కొవ్వొత్తులు చేత పట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొ న్న వారినుద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ జెన్ జీ చట్ట సభలకు రావాల్సిన అవసరం చాలా ఉందని స్పష్టం చేశారు.
పార్లమెంట్, అసెంబ్లీలకు పోటీచేసే కనీస వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తా మని తెలియజేశారు. దిక్కులు పిక్కుటెల్లేలా నినాదాలు చేస్తూ విద్యార్థులు నలుమూలల నుంచి వచ్చారన్నారు. మీ మోహల్లో విజయోత్సవం కనిపిస్తున్నదన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మీ విజయం అన్నారు. కేం ద్ర ప్రభుత్వం ఎంత అణచి వేతకు ప్రయత్నించినా పోరాటాన్ని విరమించలేదన్నారు. 58 ఇంచుల ఛాతిని ఓడించి విద్యా శాఖ మంత్రి రాజీనామా వరకు తెచ్చారని ఆయన అభినందించారు. కానీ ఇది సరిపోదన్నారు. విద్యా శాఖ మంత్రి రాజీనామాతో సరిపెట్టుకోకుండా అక్రమ కేసులను తొలగించడానికి, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు సాయం కోసం ఈ ర్యాలీ బాగుంటుందని ఆయన తెలిపారు.
జంతర్ మంతర్ నుంచి జెన్ జీ చట్ట సభలకు
జంతర్ మంతర్ నుంచి జన్ జీ చట్ట సభలకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ళ నుంచి నూనుగు మీసాల వయస్సులో ఉండే యువతకు ఓటు హక్కు కల్పించాలని 18 ఏళ్ళకే తగ్గించారన్నారు. కాబట్టి దేశంలో 30 శాతం ఉన్న జెన్ జీ చట్ట సభల్లో అడుగు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 21 ఏళ్ళకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేందుకు చట్ట సవరణ చేయాలని తాను కేంద్రాన్ని కోరుతూ వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి తీర్మానం ఆమోదిస్తామని చెప్పారు. మాజీ ప్రధాని పివి నరసింహా రావు 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకుని వచ్చి స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి 21 ఏళ్ళకు తగ్గించారని ఆయన గుర్తు చేశారు. 21 ఏళ్ళకు ఓ సోదరిమణి త్రివేండ్రం మేయర్ అయ్యారని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సివిల్ సర్వీసుకు అర్హత 21 ఏళ్ళని ఆయన చెప్పారు. 21 ఏళ్ళకు మన తెలుగు అమ్మాయి శ్రీ లక్ష్మి ఐపిఎస్ సాధించారని, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనన్య కూడా 21 ఏళ్ళకే ఐపిఎస్ సాధించిందని ఆయన వివరించారు. 32 ఏళ్ళ క్రితం తెలంగాణ రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ ఐపిఎస్ సాధించారని ఆయన తెలిపారు. అసెంబ్లీకి పోటీ చేయడానికి మన దేశంలో 25 ఏళ్ళు, రాజ్యసభకు పోటీ చేయడానికి 30 ఏళ్ళు అర్హతగా నిర్ణయించారని ఆయన చెప్పారు. సింగపూర్‌లో 21 ఏళ్ళకే పోటీ చేసి ప్రధాన మంత్రి కావొచ్చని ఆయన తెలిపారు. కాబట్టి 21 ఏళ్ళకే యువతీ, యువకులు పోటీ చేసే అవకాశం ఉండాలన్నారు. ఈడి, సిబిఐతో అక్రమ కేసులు పెట్టి రాజకీయ పార్టీలను లొంగతీసుకునే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
రాహుల్ పోరాటం ఫలితంగానే..
ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు వేలాది మంది విద్యార్థులు ఈ ఉద్యమంలో పాల్గొని తమ ఐక్యతను చాటారని పేర్కొన్నారు. దేశంలో ఏకఛత్రాధిపత్యం పాలనకు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యావత్ విద్యార్థి లోకం ఏకమైందని అన్నారు. నీట్ వంటి కీలక పరీక్షను కూడా పారదర్శకంగా నిర్వహించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. దేశ సరిహద్దుల్లో చైనా చొరబాట్లను అడ్డుకోవడంలోనూ కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. విద్యార్థుల ఆగ్రహం, ప్రజా ఉద్యమం ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించిందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 18 ఏళ్ల వయస్సులోనే యువతకు ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో భాగస్వామ్యానికి మార్గం సుగమం చేశారని గుర్తు చేశారు.
అయితే నేటి యువతకు అసెంబ్లీ, పార్లమెంట్ వంటి చట్టసభల్లో తమ స్వరం వినిపించే అవకాశాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధాని అయితే జెన్-జీ తరం నుంచి ఒకరిని కేంద్ర విద్యా శాఖ మంత్రిగా నియమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 21 ఏళ్ల వయస్సులోనే యువత చట్టసభల్లోకి ప్రవేశించే అవకాశాలను కల్పించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచే యువత పెద్దఎత్తున ప్రజాప్రతినిధులుగా ఎదిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. నీట్ పేపర్ లీక్ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

