మన తెలంగాణ/హైదరాబాద్: రైతు గోస బి జెపి భరోసా పేరిట మహా మోసపూరిత యాత్ర ను చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రతి గింజను కేం ద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా బిజెపి నా యకులను ఎక్కడికక్కడ నిలదీయాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు.
ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తూ, రైతులకు భరోసా అంటూ బిజెపి మోసపూరిత యాత్ర చేపట్టిందని మంత్రి పొన్నం సోమవా రం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ప్రతి గిం జ కేంద్రం కొనాలి, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి అని ఆయన డిమాం డ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాల తో కేంద్ర ప్రభుత్వం ప్రజలను మో సం చేస్తోందని ఆయన విమర్శించారు.
బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న పెట్రోల్, డీజి ల్ ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంటే, ప్రజల అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు రైతు గోసబిజెపి భరోసా పేరు తో యాత్ర చేపట్టడం పూర్తిగా రాజకీయ డ్రా మా అని ఆయన విమర్శించారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ముందుగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో రైతులపై సాగు వ్యయం భారీగా పెరిగిందని, ట్రాక్ట ర్లు, మోటార్లు, రవాణా ఖర్చులు అన్నీ పెరిగి రైతులపై ఎనలేని భారం పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్న బిజెపి నేతలు పెట్రోలు, డీజిల్ ధరల పెంపు అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలులో విఫలం
రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యంలో బాయిల్డ్ రైస్ అనుమతించడంలో, లేవీ రైస్‌కు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎన్నో సార్లు కోరినా కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఆయన వివరించారు. అదనంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఃరాష్ట్రవ్యాప్తంగా 8,575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తున్నామని మంత్రి వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 21 కోట్ల గోనె సంచులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ. 8,749 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు.
హామీలు నిలబెట్టుకోని కేంద్రం
ఎన్నికల సమయంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, 60 సంవత్సరాలు దాటిన రైతులకు నెలవారీ పింఛన్లు ఇస్తామని ఇచ్చిన హామీలను కేంద్రం ఇప్పటికీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. వ్యవసాయ చట్టాల పేరుతో దేశవ్యాప్తంగా రైతులను ఇబ్బందులకు గురిచేసి, 700 మందికి పైగా రైతుల ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చిన బిజెపి ఇప్పుడు రైతులకు భరోసా ఇస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదని ఆయన తెలిపారు. బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, రైతులకు మాత్రం నయా పైస రుణ మాఫీ చేయకపోవడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం అది ఆయన ఉదహరించారు.మొక్క జొన్న రైతులను అవమానపరుస్తూ క్వింటాకు కేవలం రూ. 10 మాత్రమే ఎంఎస్‌పి పెంచడం సిగ్గుచేటని, దీనిపై కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి..
బిజెపి నేతల మోసపూరిత హామీల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతులపై లాఠీ చార్జీలు చేయించిన ఘటనలు అనేకం ఉన్నాయని ఆయన తెలిపారు. రైతుల బాధలను పట్టించుకోని బిజెపి నేతలు ఇప్పుడు రైతు ప్రేమ గురించి మాట్లాడటం కపట నాటకం అని ఆయన విమర్శించారు. రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

