న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారంనాడు వరుస కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపారు. ఆ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రధానమంత్రి సూచన మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించినట్టు రాష్ట్రపతి కార్యాలయం ఒక అధికారిక ఉత్తర్వులో పేర్కొంది.దీనికిముందు ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ భావోద్వేగ లేఖ విడుదల చేశారు. ప్రజాస్వామ్యంపై అచంచల విశ్వాసం, యువత కలలు, ఆకాంక్షల పట్ల తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని అన్నారు.
తాను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదని, గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు తననెంతో బాధించాయని తెలిపారు. నీట్ పేపర్ లీక్ అక్రమాలు వెలుగులోకి వచ్చిన మొదటి రోజే సీబీఐ విచారణకు ఆదేశించడం, విజయవంతంగా మళ్లీ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. భారత యువశక్తే దేశానికి బలమని, వికసిత భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. జంతర్ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశ ఐక్యత దెబ్బతినకూడదని ఉద్దేశం, ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదనే ఆలోచనతో తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్థులు వివాదాలు, ఆందోళనలకు దూరంగా ఉండాలని, చదవు, కెరీ
ర్ నిర్మాణంపై పూర్తిగా దృష్టి సారించాలని సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనపై ఉంచిన నమ్మకం, మార్గదర్శనం, నిరంతర సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తనతో కలిసి పనిచేసిన సహచర మంత్రులు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ కాడా దేశసేవకే తన తొలి ప్రాధాన్యమని, దేశ యువత ఆకాంక్షల సాధనకు తన వంతు సేవలందిస్తానని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. నీట్ ఆందోళనలపై తలెత్తిన ప్రతిష్ఠంభనను తొలగించి సామరస్య పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర మంత్రులు, సీజేపీ ప్రతినిధుల మధ్య శనివారంనాడు మూడో రౌండ్ చర్చలు జరగడానికి కొద్ది గంటల ముందు ధర్మేంద్ర ప్రధాన తన పదవికి రాజీనామా చేశారు.
ఇదే ప్రజాస్వామ్యం, ఇది విద్యార్థుల విజయం: అభిజీత్ దీప్కే
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ మధ్య విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు స్పందిస్తూ, శాంతియుతంగా చేసే ఏ ఆందోళన అయినా లక్ష్యం సాధిస్తుందని, ఈ దేశ యువత శాంతియుత నిరసనలు వృథా పోలేదని అన్నారు. విద్యార్థుల పోరాటం ఫలించి వారి సత్తా ఏంటో తెలిసందన్నారు. 'ఇది ప్రజాస్వామ్య విజయం.. ఈ విజయం విద్యార్థులందరిదీ' అని సంతోషం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదని, తాము చేసిన డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ నెరవేరిందని, మరో రెండు డిమాండ్లు నెరవేరాలని అన్నారు. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలన్నారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేంత వరకూ తమ ఆందోళన ఆగదని చెప్పారు.

