పారిస్: జీవన వ్యయం పెరుగుదల, ఇంధన ధరలు, ప్రభుత్వ విధానాలు, విద్య, ప్రజా సేవలపై అసంతృప్తితో ఫ్రాన్స్, ఇటలీలో శనివారం నిరసనలు కొనసాగాయి. గత వారాంతంలో దుకాణాల ధ్వంసం, దోపిడీలు, పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకోవడంతో రెండు దేశాలూ భద్రతను కట్టుదిట్టం చేశాయి.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో శనివారం 1,10,000 మంది నిరసనకు దిగినట్లు పోలీసులు అంచనా వేశారు. నిరసన ముగింపు దశలో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కానన్‌లను ప్రయోగించారు.
పాఠశాలలకు మరిన్ని నిధులు కేటాయించాలని, పెరుగుతున్న జీవన వ్యయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది తమ బలాన్ని చాటిందని ఆందోళనకారులు పేర్కొన్నారు. అధికారిక ఆంక్షలతో నిరసనకారులు నగర కేంద్రానికి దూరంగా నిర్ణయించిన మార్గంలోనే ర్యాలీ నిర్వహించారు. ముగింపు సమయంలో వర్షం కురవడంతో నిరసనకు అంతరాయం కలిగింది.
మిలాన్‌లో 500 మంది అదనపు సైనికులు
మరోవైపు, మిలాన్‌లో మరోసారి హింస చెలరేగవచ్చన్న ఆందోళనతో ప్రభుత్వం 500 మంది అదనపు సైనికులను మోహరించింది. డ్రోన్ల ద్వారా నిఘా, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేపట్టింది. అక్టోబర్ 1718 తేదీల్లో మిలాన్‌లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. దుకాణాలు ధ్వంసమయ్యాయి, వస్తువులు దోచుకున్నారు. గత ఘటనలకు సంబంధించి 271 మందిని అరెస్టు చేసినట్లు అల్ జజీరా నివేదించింది. దీంతో ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం హింసాత్మక ఘటనలను అరికట్టేందుకు కఠిన భద్రతా చర్యలకు సిద్ధమైంది. అదే సమయంలో శాంతియుత నిరసనకారులు తమ ఆందోళనలను వ్యక్తం చేసే హక్కును కాపాడాలని ఉద్యమకారులు చెబుతున్నారు.

