మన తెలంగాణ/హైదరాబాద్: యువ ఆవిష్కర్తల సహకారంతో రాష్ట్రాన్ని గ్లోబల్ ఏఐ హబ్ గా మారుస్తామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
గూగుల్ డెవలపర్ గ్రూ ప్ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన దేవ్‌ఫెస్ట్-2026 టెక్ సదస్సు శనివారం ముగిసింది. 3,000 మందికి పైగా విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, టెక్ నిపుణులు హాజరైన ఈ వేదికపై మంత్రి శ్రీధర్‌బాబు ప్రీ-ఏజీఐ ఏఐ అవతార్‌ను ఆవిష్కరించారు. టెన్సర్‌గో సంస్థ అభివృద్ధి చేసిన హ్యూమ్‌ఏఐఎన్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూపొందిన ఈ అవతార్.. ప్రభుత్వ నాయకత్వంతో ప్రజలు కృత్రిమ మేధ సాయంతో సంభాషించే నూతన విధానానికి నాంది పలికింది. ఏఐ-ఎంఎల్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవ్‌ఆప్స్ తదితర నాలుగు ప్రత్యేక ట్రాక్‌లపై 30 మందికి పైగా పరిశ్రమ నిపుణులు సదస్సులో అవగాహన కల్పించారు. 'బిల్డ్, సెక్యూర్, స్కేల్' ఇతివృత్తంగా సాగిన ఈ వేడుకలో ఉద్యోగార్థులు తమ డిజిటల్ రెజ్యూమెలను నియామక సంస్థలకు వేగంగా చేరవేసేందుకు ఆధునిక రీ-రైటబుల్ ఎన్‌ఎఫ్‌సీ స్మార్ట్ బ్యాడ్జీలను వినియోగించారు. గూగుల్ ఫర్ డెవలపర్స్, లాజిటెక్, మెట్‌లైఫ్ వంటి సంస్థలు ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి, హాజరైన వారందరికీ పునర్వినియోగ వాటర్ బాటిళ్లు అందించడం ద్వారా సదస్సులో పర్యావరణ పరిరక్షణకు సైతం పెద్దపీట వేశారు.

