మనతెలంగాణ/భువనగిరి: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా అంతటి భాగ్యలక్ష్మి గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు చేతుల మీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. గౌడ మహిళల అభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ముఖ్యంగా గౌడ యువతులు విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు సాగేలా అవసరమైన సహకారం అందిస్తానని చెప్పారు. మహిళలు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మరింతగా ఎదిగేలా కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. తనకు జిల్లా మహిళా అధ్యక్షురాలి బాధ్యతలు అప్పగించిన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నర్సింగ్ యమున గౌడ్, యువజన అధ్యక్షుడు మల్కాపురి శ్రీకాంత్ గౌడ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గండి వీరేందర్ గౌడ్‌తో పాటు రాష్ట్ర, జిల్లా గౌడ సంఘం పెద్దలకు భాగ్యలక్ష్మి గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

