మన తెలంగాణ కెరమెరి: రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.
సోమవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కొలాం కొఠారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడ గ్రామంలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేకానంద, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ కె.హరిత, ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవ లక్ష్మీ, గ్రామ సర్పంచ్ మడావి సంపాబాయిలతో కలిసి సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డలందరికీ ప్రభుత్వం నుంచి అమలుచేసే ప్రతి పథకాన్ని అందించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ఆదివాసీల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపుతామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లు అందించడం జరిగిందన్నారు. గృహ నిర్మాణశాఖ సమన్వయంతో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని గూడేలు, ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేకంగా 21 వేల ఇండ్లు కేటాయించి అర్హులైనవారికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఏ గిరిజన గూడెంలోనూ గుడిసె లేకుండా పక్కా ఇండ్లు నిర్మిస్తామని, అర్హత గల ప్రతి ఒక్కరికి ఇల్లు అందిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నామని, లక్ష ఇండ్లు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని, 2 లక్షల 50 వేల ఇండ్లతో రెండవ విడత కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి అర్హత గల ప్రతి ఆదివాసి గిరిజనులకు ఇల్లు కేటాయించి నిర్మించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

