కైరో: హర్మూజ్ జలసంధిలోని ఖెష్మ్ దీవి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో నౌక సిబ్బందిలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.
నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉన్నట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.
ఖెష్మ్ గవర్నర్‌ను ఉటంకిస్తూ ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ ఈ దాడికి 'ఉగ్ర శత్రువు' కారణమని పేర్కొంది. అయితే నౌకపైకి దూసుకొచ్చిన ఆయుధం ఏమిటన్నది ఇంకా గుర్తించలేదని గవర్నర్ తెలిపారు. మృతుడు నౌక సిబ్బందిలో ఒకరని చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పర్యవేక్షించే యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సంస్థ.. జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఓ నౌకను గుర్తుతెలియని ఆయుధం తాకినట్లు తెలిపింది. అనంతరం నౌకలో మంటలు చెలరేగాయని, అందులోని వారిని స్థానిక అధికారులు సురక్షితంగా తరలిస్తున్నారని వెల్లడించింది. ఈ ఘటనపై అమెరికా సైన్యం నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదు. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా దిగ్బంధనం కొనసాగిస్తున్న నేపథ్యంలో గతంలో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకలపై అమెరికా దాడులు చేసింది. ఇదే సమయంలో ఇటీవలి రోజుల్లో అమెరికా యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
బందర్ అబ్బాస్ నౌకాశ్రయ నగరానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖెష్మ్ దీవి.. హర్మూజ్ జలసంధి మీదుగా సాగే నౌకాయానంపై ఇరాన్ నియంత్రణకు కీలక ప్రాంతంగా ఉంది. ప్రాంతీయ దేశాలకు హర్మూజ్ జలసంధిలో నౌకాయాన నిర్వహణకు సంబంధించి తన వైఖరిని వివరించేందుకు ఇరాన్ సిద్ధమవుతున్న తరుణంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాడికి కొన్ని గంటల ముందు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికాను ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమంలో స్పందించారు. 'మా ప్రజలను లొంగిపోయేలా బెదిరించలేరు. ఇరాన్ లొంగిపోదు' అని పేర్కొన్నారు.

