న్యూఢిల్లీ ః పశ్చిమాసియా ప్రస్తుత పరిస్థితిపై ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి మజీద్ తఖ్త్ రావంచి భారత్‌కు నివేదించారు. సోమవారం ఆయన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రితో ఫోన్‌లో మాట్లాడారు.
అమెరికాతో యుద్ధం నివారణ విషయంలో ఇప్పుడు సాగుతోన్న చర్చల వివరాలను మిశ్రీకి తెలియచేసినట్లు విదేశాంగ కార్యాలయం ద్వారా వెల్లడైంది. హర్మూజ్ రీ ఓపెన్, ఇరాన్ అణు విషయాలపై ప్రాధమిక ఏర్పాట్లతో తక్షణ ఒప్పందం ఖరారు కానుందని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే తఖ్త్ ఫోన్ చేయడం, పరిస్థితి వివరించడం కీలక పరిణామం అయిందని భారత విదేశాంగ కార్యదర్శి అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోమవారం విలేకరులకు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల ప్రస్తావన కూడా వచ్చింది. ప్రధానంగా హర్మూజ్ రీ ఓపెన్ విషయం చర్చల్లో చోటుచేసుకుందని , ఒప్పందం ఖరారు ప్రపంచ స్థాయిలో మంచి పరిణామమని జైస్వాల్ తెలిపారు. భారత్‌లో నాలుగురోజుల పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ముందుగా గంటల వ్యవధిలో డీల్ కుదురుతుందని చెప్పారు. గుడ్‌న్యూస్ అన్నారు. అయితే తరువాతి దశలో ప్రెసిడెంట్ సుముఖంగానే ఉన్నారు. అయితే బ్యాడ్ డీల్‌కు ఆయన అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

