లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్
ఈ ఫీజును నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించిన అప్పీల్స్ కోర్టు
సాధారణంగా 5000 డాలర్ల లోపు ఉండే ఫీజును లక్షడాలర్లకు పెంచడంపై తీవ్ర వ్యతిరేకత
వాషింగ్టన్: అమెరికాలో పనిచేయాలనుకున్న విదేశీ నిపుణులకు, వారిని నియమించుకునే టెక్ కంపెనీలకు భారీ ఊరట లభించింది. కొత్తగా జారీ చేసే హెచ్1బీ వీసాలపై 100,000 డాలర్ల (సుమారు రూ. 96 లక్షలు) భారీ ఫీజును వసూలు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ ఫీజు వసూలును నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ట్రంప్ యంత్రాంగం దాఖలు చేసిన అప్పీల్‌ను శుక్రవారం కోర్టు తిరస్కరించింది.
నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం జారీ చేసే హెచ్1బి వీసాలపై లక్ష డాలర్ల అదనపు ఫీజును విధిస్తూ గత ఏడాది సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ 20 మంది డెమొక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన దిగువ కోర్టు, అమెరికా కాంగ్రెస్ ఎలాంటి అధికారం ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ ఫీజును విధించిందని, ఇది చట్టవిరుద్ధమైన పన్ను కిందకు వస్తుందని పేర్కొంటూ జూన్ 8న ఫీజు వసూలుపై స్టే విధించింది. ఈ తీర్పును నిలిపివేయాలని ట్రంప్ యంత్రాంగం బోస్టన్ కేంద్రంగా పనిచేసే ఫస్ట్ సర్కూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం , ఈ ఫీజును విధించే అధికారం తమకు ఉందని నిరూపించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేసింది. దిగువ కోర్టు తీర్పును సమర్ధిస్తూ ప్రభుత్వ అప్పీలును తోసిపుచ్చింది. అమెరికన్ల ఉద్యోగాల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకోవడానికి హెచ్1 బీ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దానిని నిరోధించడానికే ఈ ఫీజు విధించామని ట్రంప్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంది. సాధారణంగా వివిధ అంశాలను బట్టి హెచ్1బీ వీసా ఫీజు 2000 నుంచి 5000 డాలర్ల వరకు ఉంటుంది. దీనిని ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

