హైదరాబాద్: పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు మంత్రి కొండా సురేఖ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆమె వెళ్ళిన విమానంలోనే అనుకోకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
మంగళవారం రాత్రి గంటలకు కెసి వేణుగోపాల్‌తో కొండా సురేఖ భేటీ కావాల్సి ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కెసి చర్చలు జరపడం, ఇంకా ఇతర షెడ్యూలుతో ఆయన బిజిగా ఉండడం వల్ల బుధవారం మధ్యాహ్నం కలవాలని ఆమెకు సమాచారం చేరవేసినట్లు తెలిసింది. నిజానికి కెసి వేణుగోపాల్‌కు అంతగా బిజీ షెడ్యూలు ఏమీ లేనప్పటికీ, బుధవారం మీనాక్షి నటరాజన్, మహేష్‌కుమార్ గౌడ్‌తో చర్చించిన తర్వాతే ఆమెకు అప్పయింట్‌మెంట్ ఇవ్వాలని భావించినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
దూకుడు తగ్గించాలని మంత్రి కొండా సురేఖకు పార్టీ అధిష్టానం నచ్చచెబుతుందా? లేక మంత్రి పదవికి రాజీనామా చేయిస్తారా?, ఆమె చేయనంటే ఉద్వాసన చెబుతూ గవర్నర్‌కు లేఖ పంపిస్తారా? వంటి ఊహగానాలు కొనసాగుతున్నాయి. అయితే కొండా సురేఖ మాత్రం తనకేమి కాదన్న ధీమాతో కనిపించారు. తన కుమార్తె చేసిన తప్పిదంతో తనకేమీ సంబంధం లేదన్న వాదనతోనే ఉన్నారు. కొండా సురేఖ, చిన్నా రెడ్డి వివాదంపైనా కెసి వేణుగోపాల్ బుధవారం చర్చించనున్నారు. కాగా కొండా సురేఖ మాత్రం ఢిల్లీలో లాబీయింగ్‌కు సిద్ధపడ్డారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను, ఏఐసిసి ఇతర పెద్దలను కలిసి తన గోడు వినిపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలిసింది.

