వాషింగ్టన్ : అమెరికాఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ "ఇరాన్‌తో కుదిరే ఏ ఒప్పందమైనా, చాలా గొప్పగా ఉంటుందని,లేదంటే అసలు ఉండదని వ్యాఖ్యానించారు.
ఇంకా తాము చర్చల్లోనే ఉన్నామని, ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. ఇరాన్ ముందు తాముంచిన ప్రతిపాదనలకు ఆ దేశం అంగీకరిస్తేనే ముందడుగు వేస్తామన్నారు. ఈ విషయంపై గల్ఫ్ దేశాల అధినేతల తోనూ సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇరాన్‌తో ఒప్పందంపై డెమోక్రాట్లు విమర్శించడంపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఒబామా , ఆయన యంత్రాంగం లోని అనుభవం లేని అధికారులు ఇరాన్ అణు ఒప్పందాన్ని ప్రతిపాదించి అమలు లోకి తెచ్చారని , అప్పటి ఒప్పందానికి, ఇప్పుడు తాము జరుపుతున్న చర్చలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.
ఇరాన్‌కు అణుశక్తిని అందించే ఒప్పందాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం కొనసాగుతున్నా, ఇరాన్ రేవులను అమెరికా ముట్టడించినా రెండు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఇస్మాయెల్ బఘేయి మాట్లాడుతూ చర్చించవలసిన అంశాల్లో చాలా వరకు ఇరాన్, అమెరికా ఒక అభిప్రాయానికి వచ్చాయని, అయితే ఒప్పందంపై సంతకాలు చేయడానికి సమయం ఆసన్నమైందని అర్థం కాదని ఆయన స్పష్టం చేశారు. టెహ్రాన్‌లో పాత్రికేయుల సమావేశంలో ఆయన బఘేయి మాట్లాడుతూ ఈ దశలో ఇరాన్, అమెరికా అణు విషయం చర్చించడం లేదని , తమ దృష్టి అంతా యుద్ధం అంతం కావడమేనని స్పష్టం చేశారు. తమ ప్రతిపాదనలను అమెరికా మన్నిస్తుందన్న గ్యారంటీ లేదన్నారు.
ఎలాంటి బెదిరింపులను టెహ్రాన్ లక్షపెట్టదని పేర్కొన్నారు. అంతకు ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కొ రూబియో ఇరాన్‌తో అమెరికా గట్టి ఒప్పందం చేసుకుంటుందని లేదా ఇరాన్‌తో ఘర్షణ తప్పదని వెల్లడించారు. హార్ముజ్ జలసంధిని తెరిపించడంలో తమ సామర్థం విషయంలో తమ ముందు పటిష్టమైన ప్రతిపాదని ఉందని తాను అనుకుంటున్నానని చెప్పారు. ఒప్పందం కుదిరి సంతకాలు జరిగేవరకు అమెరికా ముట్టడి కొనసాగుతుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఆదివారం వెల్లడించారు. చర్చలకు సంబంధించిన దౌత్యవర్గ ప్రతినిధుల్లో కీలకమైన మధ్యవర్తి పాకిస్థాన్‌కు చెందిన అధికారులు సోమవారం చైనా పర్యటనలో ఉన్నారు. పాక్ మిలిటరీచీఫ్ ఆసిమ్ మునీర్ ,ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా నేతలతో చర్చలు జరపడానికి బీజింగ్‌లో ఉన్నారు. పశ్చిమాసియాలో వేగంగా శాంతి పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామన్నారు.

