అమరావతి: మనకు జీవితాన్ని ఇచ్చే నదులను చంపవద్దు అని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సూచించారు. గోదావరి, కృష్ణా నదులను రక్షించుకోవాలని అన్నారు. పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్షించారు.
గోదావరి తీరంలో ఉన్న పరిశ్రమల యజమానులతో పవన్ భేటీ అయ్యారు. నదిలో కాలుష్య నివారణ చర్యలపై మార్గనిర్దేశం చేశారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు ఆదేశించారు. తదుపరి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే 6నెలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని, జీవనదుల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. నదుల రక్షణకు ఇవాళ్టి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని, గోదావరి, కృష్ణా నదులను కాలుష్యరహితంగా మార్చడమే లక్ష్యం అని రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు కీలకం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
స్వచ్ఛమైన నీటిని కలుషితం చేయడం, నదిలో తాగునీరు మురుగును కలపడం సరికాదని అన్నారు. మురుగునీటిని నేరుగా పంట కాలువల్లో కలిపేస్తున్నారని, పూర్తిగా శుద్ధి చేయకుండా నదిలోకి వ్యర్థాలు వదులుతున్నారని విమర్శించారు. ఆక్వా పరిశ్రమలు సైతం మరింత బాధ్యతగా వ్యవహరించాలని, జీవనదులను చేజేతులా కలుషితం చేసుకోవద్దన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని తెలియజేశారు. ఆంధ్రా, డెల్టా పేపర్ మిల్లుల వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయని, పరిశ్రమలు నుంచి వచ్చే వ్యర్థాలను తప్పనిసరిగా శుద్ధి చేయాలని అధికారులకు సూచించారు. కాలుష్యం పేరుతో ఎవరైనా ఇబ్బంది పెడితే తమకు చెప్పండని, పరిశ్రమలు నుంచి ఎప్పటికప్పుడు శాంపిల్స్ తీసుకుంటున్నామని చెప్పారు. కాలుష్యాన్ని నదిలోకి వదిలే పరిశ్రమలపై చర్యలు తీసుకుంటున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

