Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్‌ను వీడం

కాంగ్రెస్‌ను వీడం

పార్టీ మార్పుపై పుకార్లు నమ్మొద్దు

మంత్రి పదవి పోయినా బాధలేదు..అకారణంగా తొలగించడమే బాధించింది

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేద్దాం

వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచే పోటీ చేసి గెలుస్తా

ఎన్ని కష్టాలు వచ్చినా.. మా వెంట ఉన్న కార్యకర్తలకు రుణపడి ఉంటాం

మాజీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు

మన తెలంగాణ/వరంగల్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ తూర్పు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. వరంగల్‌లోని ఎం.కె. నాయుడు హోటల్‌లో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కొండా సురేఖ మాట్లాడారు. గత పది రోజులుగా కార్యకర్తలు, అ భిమానులు మనోవేదనకు గురైన విషయం తమకు తెలుసని అన్నారు.

సుమంత్ బెయిల్ వ్యవహారం కారణంగా కార్యకర్తలను కలవడం కొంత ఆలస్యమైందని చెప్పారు. వినాయక చవితి నవరాత్రుల నేపథ్యంలో తాము సుమారు 15 రోజులపాటు కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సినందున.. ముందుగానే కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడాలని సమావేశం ఏర్పాటుచేసినట్లు వివరించారు. పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచేవారే అసలైన నాయకులని పేర్కొన్నారు. తన 32 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎంపీటీసీ స్థాయి నుంచి మంత్రి పదవి వరకు ఎదిగాన ని చెప్పారు.

తన భర్త కొండా మురళి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తనను ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. శాయంపేట, పరకాల, వరంగల్ తూర్పు ప్రాంతాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు తమ వెంట నిలిచారని, వారికి రుణపడి ఉంటామన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో అవకాశవాద ధోరణులు పెరిగిపోయాయని విమర్శించారు. ఉదయం ఒక పార్టీ వద్ద.. మధ్యాహ్నం మరో పార్టీ వద్ద.. సాయంత్రం ఇంకో పార్టీ వద్ద ఉండే రాజకీయ నాయకులు తయారయ్యారని విమర్శించారు. ప్రజల్లో తమకు ఉన్న విశ్వాసానికి కార్యకర్తలే బలమని తెలిపారు. కొండా దంపతులకు వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంపై నమ్మకంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. నమ్ముకున్న నాయకుడి కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్నామని, ఆ నిర్ణయంపై ఏనాడూ బాధపడలేదన్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమపై వచ్చిన ఫిర్యాదులు, విమర్శలను ధైర్యంగా ఎదుర్కొన్నామని తెలిపారు. బిఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలో తన భర్త కొండా మురళిని వరంగల్ తూర్పు నుంచి పోటీ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఆ సూచన మేరకే వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసినట్లు చెప్పారు. తర్వాత పరకాలకు వెళ్లడం రాజకీయంగా తాము చేసిన పొరపాటని పేర్కొన్నారు.

అక్కడి రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకున్నతర్వాత తిరిగి వరంగల్ తూర్పుకు వచ్చామని, ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండేళ్ల ఎనిమిది నెలలపాటు మంత్రి పదవిలో కొనసాగిన సమయంలో తనకు అప్పగించిన మూడు శాఖలను సమర్థంగా నిర్వహించానని పేర్కొన్నారు. పదవికి ఎక్కడా ద్రోహం చేయలేదని, అవినీతికి పాల్పడలేదని, తనపై చిన్న మచ్చ రాకుండా పనిచేశానన్నారు. తన వద్దకు వచ్చిన ప్రజల్లో 99 శాతం మందికి సాధ్యమైనంత మేరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించానన్నారు. పదవి లేకపోయినా ప్రజలకు సేవ చేయవచ్చన్నారు. మంత్రి పదవి పోయిందని తాను బాధపడటంలేదని..కానీ ఎలాంటి కారణం లేకుండా తొలగించారన్నదే బాధ కలిగించిందన్నారు.

తనను రాజీనామా చేయాలని, వరంగల్ తూర్పు నుంచి పోటీ చేయాలని కొందరు గుంట నక్కలు కోరుతున్నారని వ్యాఖ్యానించారు. మీరు నాతో పోటీ కాదు.. ముందు మీ సొంత 25వ డివిజన్‌లో గెలిచి చూపించండి.. వచ్చే ఎన్నికల్లో మీ డివిజన్‌లోనే మహిళా అభ్యర్థిని నిలబెడతా. అంటూ వరంగల్ తూర్పుకు చెందిన ఓ ఎమ్మెల్సీని ఉద్దేశించి సురేఖ సవాల్ విసిరారు. గతంలో వరంగల్‌లో కొనసాగిన పాలనను ప్రస్తావించిన సురేఖ.. అప్పటి ఓ నాయకుడు, ఆయన సోదరుడు, ఆయన కుమారుడి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు గుండు సుధారాణి వ్యవహారాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. తమ నాయకుడు కొండా మురళి ఆదేశాల మేరకు ఛైర్మన్ పదవి కోసం లేఖ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పదవి వచ్చిన తర్వాత కనీసం ఫోన్ చేసి మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన అనంతరం హైదరాబాద్‌లోనే ఉంటే.. ప్రజల్లోకి రావాలని నవీన్ రాజు తనకు సూచించేవారని కొండా సురేఖ తెలిపారు. వరంగల్ తూర్పు నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేరువగా ఉంటానని కొండా సురేఖ పేర్కొన్నారు. తాము పార్టీ మారుతున్నట్లు పలు ఛానళ్లలో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలను ఆమె ఖండించారు.

కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం అని ఆమె స్పష్టం చేశారు. గతంలో కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా వైఎస్సార్‌సిపి, అనంతరం బిఆర్‌ఎస్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక జెండా కింద గెలిచి మరో జెండా కిందకు వెళ్లే రాజకీయాలు తాము చేయలేదన్నారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో గెలిచిన వరంగల్ తూర్పు స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదని సురేఖ స్పష్టం చేశారు. తన భర్త కొండా మురళికి భవిష్యత్తులో పార్టీ తరఫున ఛైర్మన్ పదవి వస్తుందన్న నమ్మకం ఉందన్నారు.రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 24 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సురేఖ పిలుపునిచ్చారు. మంత్రి పదవి పోయిందని ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చోబోనని, ఇకపై మరింతగా ప్రజల్లో ఉంటానన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు చూపిస్తామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu