మహారాష్ట్రలోని పూణే (కోరేగావ్ పార్క్ పరిసరాల్లో) కదులుతున్న కారులో ఒక మహిళా లాయర్‌పై అత్యాచారం మరియు లైంగిక వేధింపులు జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాలలోకి వెళితే పోలీసులు కథనం ప్రకారం..
బీహార్‌లోని పాట్నాకు చెందిన మహిళ పూణేలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి ముంబై హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వృత్తి పరమైన పని మీద ఆమె ఆదివారం పూణేకు వచ్చి ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేశారు. ఆదివారం రాత్రి హోటల్‌లోని పబ్‌లో ఉన్న సమయంలో, పక్క టేబుల్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులతో ఆమెకు మాటలు కలిసి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారంతా కలిసి మరో పబ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.పబ్ వెళ్తుండగా తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ముంధ్వా-కోరేగావ్ పార్క్ రోడ్డుపై నిర్జన ప్రదేశంలో కదులుతున్న కారులోనే ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశాడు.
అంతేకాకుండా నిందితులు తమ మరో ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించి వేధించారు. బాధితురాలు నిలదీయడంతో ఆమె పర్సును రోడ్డుపై పడేసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.బాధితురాలు స్థానికుల సహాయంతో కోరేగావ్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ (CCTV) ఫుటేజ్, కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అభిషేక్ నవనాథ్ ముక్తే, ధనంజయ్ సోర్టే, ఆదేశ్ షిండేలుగా గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు ఉన్నట్లు గుర్తించగా, పరారీలో ఉన్న నాల్గవ నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

