Dailyhunt
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కవిత పార్టీకి 'తెలంగాణ రక్షణ సేన'(టీఆర్‌ఎస్) అనే పేరును ఖరారు చేస్తూ సిఇసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో అధికారులు ఆమెకు కొత్త పార్టీకి సంబంధించిన అధికారిక లేఖను అందజేశారు. కాగా, తెలంగాణ రక్షణ సేన పేరును ప్రాథమికంగా ఖరారు చేస్తున్నట్లు సిఇసి కవితకు రాసిన లేఖలో పేర్కొంది. పార్టీ పేరుపై రెండు జాతీయ, పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న రాష్ట్రంలో రెండు స్థానిక పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. కొత్త పార్టీ పేరుపై నెల రోజుల్లోపు(30 రోజుల్లోపు) అభ్యంతరాలను తెలపాలని పేర్కొంది. అభ్యంతరాల పరిశీలన తర్వాత పార్టీ పేరు ఖరారు చేస్తామని ఇసి ప్రకటించింది.

పార్టీ ఏర్పాటుకు నాలుగు పేర్లతో దరఖాస్తు

తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి పేర్లలో ఒక పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కవిత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కాగా, 'తెలంగాణ రక్షణ సేన పేరును ప్రాథమికంగా ఖరారు చేస్తున్నట్లు కవితకు ఇచ్చిన లేఖలో సిఇసి తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత పార్టీ ప్రకటన

కల్వకుంట్ల కవిత ఈ నెల 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా నూతన రాజకీయ పార్టీ పెద్ద ఎత్తున ప్రకటించారు. పార్టీకి 'తెలంగాణ రాష్ట్ర సేన'గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. అయితే, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆ పేరుకు బదులుగా 'తెలంగాణ రక్షణ సేన' పేరుకు ఆమోదం తెలిపింది.

టీఆర్‌ఎస్...నాకు రాసిపెట్టి ఉందేమో : కవిత ట్వీట్

తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నానని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్)కు సిఇసి ఆమోదం తెలిపిందని ఆమె ఎక్స్ వేదిగా ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం తాను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని తెలిపారు. జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని, అందులో మూడవ ప్రాధాన్యతగా తాము ఇచ్చిన పేరును ఇసి ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం అని పేర్కొన్నారు. "టీఆర్‌ఎస్ నాకు రాసిపెట్టి ఉందేమో" అంటూ ట్వీట్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu