బెంగళూరు: ఉద్యోగ అవకాశాల్లో కన్నడిగులను ప్రైవేటు సంస్థలు ఉద్దేశపూర్వకంగా పక్కనపెడుతున్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారం తెలిపారు.
కన్నడిగులకు ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదన్న ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని ఎక్స్‌లో చేసిన పోస్టులో శివకుమార్ పేర్కొన్నారు. వారి హక్కులు, గౌరవం, అవకాశాలకు ఎలాంటి భంగం కలగనివ్వబోమని స్పష్టం చేశారు. 'కర్ణాటకలో కన్నడిగుడే సార్వభౌముడు. ఏ కారణంతోనూ కన్నడిగుల హక్కులు, గౌరవం, అవకాశాలను నిర్లక్ష్యం చేయడానికి ప్రభుత్వం అనుమతించదు' అని ఆయన అన్నారు.
బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా భారత సాంకేతిక రాజధానిగా గుర్తింపు పొందిందని పేర్కొన్న ఆయన.. కన్నడిగుల ప్రతిభ, నైపుణ్యాలు, సామర్థ్యాలపై రాష్ట్రం ఎంతో గర్విస్తోందన్నారు. 'ఏదైనా ప్రైవేటు సంస్థ కన్నడిగులను ఉద్దేశపూర్వకంగా పక్కనపెడుతున్నట్లు తేలితే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది' అని తెలిపారు. కన్నడిగుల ప్రయోజనాలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శివకుమార్ స్పష్టం చేశారు.

