శ్మీర్‌లో సోమవారం 300 మంది పర్యాటకులు కేబుల్ కారులో చిక్కుపడి గంటల తరబడి భూమ్యాకాశాల మధ్య కొట్టుమిట్టాడారు. దాదాపు ఏడుగంటల పాటు త్రిశంకు స్వర్గంగా గడిపిన వీరిని బహుళ స్థాయి సహాయక బృందం అతి కష్టం మీద సురక్షితంగా కిందికి చేర్చింది.
గుల్మార్గ్‌లోని గొండోలాలో విహారయాత్రకు వచ్చే వారు కేబుల్ కార్లలో వెళ్లుతుండగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీనితో 65 క్యాబిన్ల కేబుల్ కారు ముందుకు కదలక మధ్యలోనే మొరాయించింది. పర్యాటకుల హాహాకారాలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. ఏడు గంటల పాటు దిక్కుతోచని స్థితిలో పడ్డ వీరి గురించి సమాచారం తెలియగానే పలు సహాయక నిపుణుల బృందాలు అక్కడికి చేరుకున్నాయి. పోలీసులు, ఆర్మీ వెంటరాగా అక్కడి తక్షణ రెస్కూ టీంలు తరలివచ్చి ఏడుగంటలు శ్రమించి కేబుల్ కారు ముప్పు నుంచి పర్యాటకులను రక్షించారు.
భూ మట్టానికి 500 అడుగుల ఎత్తున యాత్రికులు చిక్కుపడ్డారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. ఎన్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్రానికి చెందిన ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసు, సైన్యానికి చెందిన చినార్ దళాలు రంగంలోకి దిగి సంయుక్తంగా జరిపిన చర్యలతోనే వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. సుశిక్షితులు రంగంలోకి దిగి, తాళ్లు, నిచ్చెనలతో కేబుల్ కారును చేరుకుని పర్యాటకులను భూమిపైకి తీసకువచ్చారు. అంతా సవ్యంగా ముగిసింది. మధ్యాహ్నం తలెత్తిన ముప్పు సాయంత్రానికి తొలిగిపోయింది. అంతా క్షేమం అని స్థానిక అధికారులు తెలిపారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధికారులను ఆదేశించారు. తలెత్తిన సాంకేతిక సమస్యపై దర్యాప్తునకు అధికారులు రంగంలోకి దిగారు. ఘలన తరువాత ఇక్కడ సాగే రెండు కేబుల్ కార్ల టూర్లను నిలిపివేశారు.

