Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళం ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలిచారు: మంత్రి శ్రీధర్‌బాబు

కేరళం ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలిచారు: మంత్రి శ్రీధర్‌బాబు

ధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజ్యాంగబద్ధమైన విలువల కోసమే పోరాడుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

కేరళంలో విజయం ఆ పోరాటానికి దక్కిన గుర్తింపు అని వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయని అన్నారు. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కూటమి సాధించిన ఘన విజయం, ప్రజాస్వామ్య విలువలపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం అని, విద్వేష రాజకీయాలపై వివేకపు గెలుపు అని పేర్కొన్నారు. విభజన రాజకీయాల కంటే అభివృద్ధి, ఐక్యత, లౌకిక విలువలకే ప్రజలు పెద్దపీట వేస్తారని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని చెప్పారు. కేరళం ప్రజలు విద్వేషానికి తావులేకుండా, అభివృద్ధిని, ఐక్యతను ఎంచుకుని దేశానికే ఆదర్శంగా నిలిచారని వ్యాఖ్యానించారు. కేరళంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ప్రదర్శించిన పోరాట పటిమ అభినందనీయమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తకు, తమపై నమ్మకం ఉంచిన ప్రతి ఓటరుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడూ మనుషులను కలపడమే కానీ విడదీయడం కాదు అని, కాంగ్రెస్ ప్రయాణం ఎప్పుడూ ప్రజల హితం కోసమే అని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో తాము నమ్ముకున్న 'ప్రేమ - సామాజిక న్యాయం' అనే మార్గమే సరైనదని కేరళం తీర్పు బలపరిచిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లోనూ ముందుకు సాగుతామని వెల్లడించారు. తెలంగాణలో సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి వస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చుతామని తెలిపారు. 2029లో దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో(లోక్‌సభ) కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధిస్తుందని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu