జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో కొడుకుతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మల్యాల గ్రామానికి చెందిన గుండేటి కవిత(34), గురువారం తెల్లవారుజామున తన సోదరుడు ఆడెపు కొమురయ్యకు ఫోన్ చేసి తన ఇద్దరు కొడుకులను బాగా చూసుకోవాలని కోరి.. ఇంటి నుంచి చిన్న కొడుకును శశాంక్(7) తీసుకొని బయటకు వెళ్లింది.దీంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఉదయం సుమారు 5.30 గంటలకు ముత్యంపేట శివారులోని బావి వద్ద కవిత మొబైల్ ఫోన్, చెప్పులు కనిపించాయి.
బావిలో చూడగా ఆమె మృతదేహం ఉంది. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కవితకు ఇద్దరు కుమారులు నిఖిలేశ్ , శశాంక్ ఉన్నారు. చిన్న కుమారుడు శశాంక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్న కుమారుడు శశాంక్ ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మృతురాలి సోదరుడు ఆడెపు కొమురయ్య ఫిర్యాదు మేరకు మల్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి, అప్పులు, కుమారుడి అనారోగ్యం నేపథ్యంలో కవిత తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

