మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోని అత్యున్నత క్రీడా శిక్షణ సంస్థల్లో ఒకటైన కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ (కెఎన్‌ఎస్‌యూ)తో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్ యూనివర్సిటీ (వైఐఎస్‌యూ) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుందని సిఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ వేదికగా తెలిపారు.
ఇటీవల తన దక్షిణ కొరియా పర్యటనలో కెఎన్‌ఎస్‌యూ అధ్యక్షుడు మూన్ వోన్-జేతో సహా ఉన్నత ప్రతినిధి బృందంతో తాను జరిపిన సవివర చర్చల ఫలితంగానే ఈ భాగస్వామ్యం కుదిరినట్లు సిఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిపాదిత యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కెఎన్‌ఎస్‌యూ సహకారాన్ని కోరుతోందన్నారు.
ఈ ఒప్పందం కేవలం ఎంఓయూ మాత్రమే కాదనీ, తెలంగాణ క్రీడా ప్రతిభకు, ప్రపంచస్థాయి అథ్లెట్ శిక్షణ, క్రీడా విజ్ఞానం, ఉన్నత క్రీడా విద్యలోని ఉత్తమ పద్ధతులకు మధ్య వారధిగా నిలువనుందన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా సాధించిన 32 పతకాల్లో 16 పతకాలు కెఎన్‌ఎస్‌యూలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించారని, ఆ శ్రేష్ఠమైన సంస్కృతిని తెలంగాణకు తీసుకురావడమే లక్ష్యమని సిఎం ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ కీలక కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న క్రీడా శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, క్రీడా మంత్రిత్వ శాఖ, వైఐఎస్‌యూ అధికారులను సిఎం అభినందించారు. 2036 ఒలింపిక్స్‌కు భారత్ సన్నద్ధమవుతున్న వేళ, తెలంగాణ కేవలం ఆతిథ్యానికే కాకుం డా, దేశానికి గర్వకారణంగా నిలిచే ఒలింపిక్ క్రీడాకారులను తయారు చేసేం దుకు సిద్ధమవుతోందని సిఎం స్పష్టం చేశారు.

