Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూల్చింది మీరు.. కాపాడేది మేం

కూల్చింది మీరు.. కాపాడేది మేం

న తెలంగాణ/హైదరాబాద్: పదేళ్ల పాటు బిఆర్‌ఎస్ ప్రభుత్వం నీటి పారుదల శాఖను నాశనం చేసిందని రాష్ట్ర నీటిపారుదల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.

పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవితాలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే శారు. బిఆర్‌ఎస్ నాయకులు ఏది ముట్టుకుంటే అది నాశనమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖను చక్కదిద్దామని వ్యా ఖ్యానించారు. అధిక శాతం లోన్లు తీసుకొచ్చి బిఆర్‌ఎస్ నాయకుల లాభం కోసం కాళేశ్వరం కట్టారు తప్ప.. తెలంగాణ ప్రజల కోసం కాదని చెప్పారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంత నిధులు ప్రాజెక్టులపై ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. ఇంత ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలని, ప్రాజెక్టులు అన్ని అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు.

తాము అధికారంలో వచ్చాక ఇరిగేషన్ శాఖను చక్కదిద్దామని వివరించారు. రాష్ట్ర సచివాలయం లో ఆదివారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఇ.శ్రీధర్, ప్రముఖ టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఇంజనీర్ -ఇన్ -చీఫ్ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌లతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్లుగా బిఆర్‌ఎస్ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కెసిఆర్ హయాంలోనే.. కూలిపోయింది వాళ్ల హయాంలోనే అని ఇంజినీర్లు రిపోర్ట్ ఇచ్చారని ప్రస్తావించారు. కన్నెపల్లి పంపు దగ్గరకు పోయి ప్రాణహిత పంపు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలంటూ మాజీ మంత్రి కెటిఆర్ నాటకాలు ఆడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా కడితే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. బిఆర్‌ఎస్ వల్లే కాళేశ్వరం నీళ్లు ఉపయోగించలేకపోతున్నామని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఫౌండేషన్ తప్పుగా ఉంది

నాసిరక నిర్మాణం వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఉపయోగించలేకపోతున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫౌండేషన్ తప్పుగా ఉందని అధికారులు రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ఇలానే కొనసాగిస్తే ప్రమాదమని అంతర్జాతీయ, జాతీయ నీటి నిపుణులు నివేదిక ఇచ్చారని అన్నారు. కెటిఆర్ కన్నా ఎన్‌డిఎస్‌ఎ అధికారులకు నాలెడ్జ్ ఎక్కువగా ఉందని తాను అనుకుంటున్నానని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు స్టోరేజ్ చేసినప్పుడు కూలిపోతే కింద ఉన్న 40 ఊర్లు, భద్రాచలం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ నాయకులు కమీషన్లకు కక్కుర్తి పడి తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టకుండా తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. లేకపోతే ఎప్పుడో ఉత్తర తెలంగాణ సస్యశామలం అయ్యేదని వివరించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది గులాబీ పార్టీనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కి మంచి పేరు వస్తుందనే కారణంతో తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకి డిజైన్ మార్చారని మంత్రి దుయ్యబట్టారు.

బిఆర్‌ఎస్ నేతలు ప్రచారం పూర్తిగా అవాస్తం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన నిర్మాణ లోపాలను దాచిపెట్టి ప్రజలను, రైతులను బిఆర్‌ఎస్ నాయకులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ ప్రచార సాధనంగా మార్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, ఇప్పుడు అదే తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోని కన్నేపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించి నీటిని ఎత్తిపోయవచ్చని బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు.

పంపులు ఆన్ చేయడం సాధ్యం కాదు.. అసలు చేయలేం అని, శాస్త్రీయ పునరావాసం పూర్తయ్యే వరకు మూడు బ్యారేజీలను నిర్వహించరాదని జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ(ఎన్‌డిఎస్‌ఎ) స్పష్టంగా ఆదేశించిందని తెలిపారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టే నిర్ణయం తమ ప్రభుత్వం ఎప్పటికీ తీసుకోదని స్పష్టం చేశారు. కాళేశ్వరం సమస్యను రాజకీయ కోణంలో కాకుండా ఇంజినీరింగ్ కోణంలో చూడాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం బాధ్యతారాహిత్యం అని మండిపడ్డారు.

మూడు బ్యారేజీల పునాదులన్నీ అనుమానాస్పదమే

ఎన్‌డిఎస్‌ఎ తుది నివేదికలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల్లో తీవ్రమైన నిర్మాణ లోపాలు ఉన్నట్లు స్పష్టంగా పేర్కొన్నదని మంత్రి తెలిపారు. సెకెంట్ పైల్ కట్ -ఆఫ్ వాల్‌ల బలహీనతలు, పునాదుల కింద సీపేజ్, పైపింగ్, స్టిల్లింగ్ బేసిన్ల లోపాలు, నాణ్యతా వైఫల్యాలు, శక్తి వ్యయ నిర్మాణాల బలహీనతలు వంటి అనేక కీలక సమస్యలను నివేదిక గుర్తించిందన్నారు. ఇది ఒక్క పిల్లర్ సమస్య కాదు... ఒక్క గేట్ సమస్య కాదు... మొత్తం బ్యారేజీ పునాది వ్యవస్థ సమగ్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు. లోపాలను సరిచేయకుండా నీటిని నిల్వ చేస్తే భద్రాచలం సహా దిగువ ప్రాంతాల్లో తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉందని మంత్రి హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రత విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడదని స్పష్టం చేశారు.

ప్రాణహిత-చేవెళ్లను నిర్వీర్యం చేశారు

కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన అసలు ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును అమలు చేసి ఉంటే ఉత్తర తెలంగాణకు గ్రావిటీ ద్వారా సుమారు 80 టీఎంసీల స్థిర నీటి భద్రత లభించేదని మంత్రి తెలిపారు. రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రాజెక్టు రూపకల్పనను మార్చడం వల్లనే నేటి పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రాణహిత -చేవెళ్ల అసలు రూపం అమలై ఉంటే ఎల్‌నినో వంటి పరిస్థితుల్లో కూడా ఉత్తర తెలంగాణ ఇబ్బందులు ఎదుర్కొనేది కాదని చెప్పారు. స్వార్థం, అత్యాశ, సాంకేతిక రాజీల ఫలితమే నేటి కాళేశ్వరం సంక్షోభమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శాస్త్రీయ పునరుద్ధరణకు వేగం

మూడు బ్యారేజీలపై గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వేలు, 80 మీటర్ల లోతు వరకు బోర్ హోల్స్, హైడ్రాలిక్ మోడలింగ్, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, డిజిటల్ ట్విన్ సిమ్యులేషన్లు వంటి అత్యాధునిక పరీక్షలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ పనులను పుణేలోని సిడబ్లూపిఆర్‌ఎస్, అంతర్జాతీయ కన్సల్టెంట్ ఎఎఫ్‌ఆర్‌వై, ఐఐటీ బొంబాయి, ఎన్‌డిఎస్‌ఎ,సిడబ్లూసి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత వర్షాకాలంలో డిజైన్‌లను ఖరారు చేసి, వరదలు తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జూలై-ఆగస్టు 2027 నాటికి పనులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు. అప్పటి వరకు మూడు బ్యారేజీలను ఫ్రీ- ఫ్లో స్థితిలోనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కాళేశ్వరం పునరుద్ధరణతో పాటు టుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుమారు 80 టిఎంసిల నీటిని తెలంగాణకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికను వేగవంతం చేసిందని తెలిపారు. డిపిఆర్ సిద్ధమవుతోందని, మహారాష్ట్రతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ, సాగునీరు, తాగునీటి రంగాల్లో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రజల ప్రాణాలు, ప్రజాధనం, భవిష్యత్ నీటి భద్రతలలే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యతా అంశాలు మంత్రి పునరుద్ఘాటించారు. శాస్త్రీయ పునరావాసం పూర్తయి ఎన్‌డిఎస్‌ఎ, సిడబ్లూసి అనుమతులు వచ్చిన తర్వాతే మూడు బ్యారేజీలు నిర్వహణలోకి వస్తాయని తెలిపారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu