కీమోథెరపీకి తోడుగా లక్ష్యిత మందులు, రేడియోధార్మిక చికిత్సలు
మెర్క్, మోడెర్నా క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలు
వచ్చే ఏడాదే అందుబాటులోకి ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్?
'కార్ట్‌సెల్' థెరపీ' తొలి అడుగులు విజయవంతం
త్వరలో మరికొన్ని రకాల క్యాన్సర్ల క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు
చికిత్సలో పెరుగుతున్న కృత్రిమ మేధ పాత్ర
మన తెలంగాణ/హైదరాబాద్ : క్యాన్సర్.. ఈ మహమ్మారి పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. సామాన్యుల నుంచి ధనవంతులను సైతం బెంబేలెత్తిస్తోంది. దానికి కారణం సరైన చికిత్స లేకపోవడమే. అప్రమత్తంగా లేకపోతే, ఆదిలోనే క్యాన్సర్‌ను గుర్తించకపోతే జీవితాన్నే మింగేస్తుంది. ఎవరైనా వైద్యుడు అనుమానించి రోగికి సంబంధింత పరీక్షలు జరిపించుకోవాలని సూచించినప్పటి నుంచి వాళ్లతో పాటు ఆప్తుల గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది. నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ వస్తే ఊపిరిపీల్చుకోవడం, పాజిటివ్ వస్తే నిరాశ నిస్పృహలతో సగం చచ్చినంత పని అవుతుంది. సర్వసాధారంగా ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితి ఇది. అయితే ఈ అభిప్రాయం క్రమంగా మారుతోంది.
క్యాన్సర్ చికిత్సలో వేగంగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న కీమోథెరపీ, రేడియేషన్, శస్త్రచికిత్సలతో పాటు.. క్యాన్సర్ కణాలను ప్రత్యేకంగా గుర్తించి దాడి చేసే కొత్త తరం చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని ఇప్పటికే రోగులకు అందుతుండగా, మరికొన్ని పెద్ద క్లినికల్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు చూపిస్తున్నాయి. టార్గెటెడ్ థెరపీలు, యాంటీబాడీ -డ్రగ్ కాంజుగేట్స్ (ఏడీసీ) క్యాన్సర్ కణాల్లోని నిర్దిష్ట లక్షణాలను గుర్తించి వాటిపైనే దాడి చేస్తాయి. సాధారణ కీమోథెరపీతో పోలిస్తే ఔషధాన్ని క్యాన్సర్ కణానికి మరింత కచ్చితంగా చేర్చడం వీటి ప్రధాన లక్ష్యం. రొమ్ము క్యాన్సర్‌తో పాటు పలు క్యాన్సర్లలో ఈ తరహా చికిత్సలు ఇప్పటికే ఉపయోగంలో ఉన్నాయి.
కణితి దగ్గరే రేడియేషన్
రేడియో ఫార్మాస్యూటికల్స్ మరో కీలక పరిణామం. క్యాన్సర్ కణాన్ని గుర్తించే అణువుకు రేడియోధార్మిక పదార్థాన్ని జతచేసి.. అది నేరుగా కణితి వద్దకు చేరేలా చేస్తారు. ప్రోస్టేట్, న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్లలో ఇలాంటి చికిత్సలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని క్యాన్సర్లకు విస్తరించే అవకాశం ఉంది.
రోగి క్యాన్సర్‌కు ప్రత్యేక వ్యాక్సిన్!
కొత్త తరంలో అత్యంత ఆసక్తి రేపుతున్నది వ్యక్తిగతీకరించిన ఎంఆర్‌ఎన్‌ఏ క్యాన్సర్ వ్యాక్సిన్. రోగి క్యాన్సర్ కణాల్లోని ప్రత్యేక మార్పులను విశ్లేషించి వాటిని లక్ష్యంగా చేసుకునేలా వ్యాక్సిన్‌ను రూపొందించడం దీని ప్రత్యేకత. మెర్క్, మోడెర్నా అభివృద్ధి చేస్తున్న ఎంఆర్‌ఎన్‌ఏ 4157/వి940 మెలనోమా క్యాన్సర్‌లో కీలక దశకు చేరుకుంది. పెద్ద దశ క్లినికల్ ట్రయల్‌లో మంచి ఫలితాలు రావడంతో నియంత్రణ సంస్థల అనుమతులు లభిస్తే ఎంపిక చేసిన రోగులకు 2027 ప్రాంతంలోనే ఈ తరహా చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది అన్ని రకాల క్యాన్సర్లకు పనిచేస్తుందని ఇప్పుడే చెప్పలేం. ఇతర క్యాన్సర్లలో జరుగుతున్న ట్రయల్స్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
రోగి రక్షణ కణాలకే కొత్త శక్తి
'కార్ట్ సెల్' థెరపీలో రోగి రోగనిరోధక వ్యవస్థలోని 'టి'-కణాలను సేకరించి, క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేసేలా మార్పులు చేసి తిరిగి శరీరంలోకి పంపుతారు. రక్త క్యాన్సర్లలో ఇది ఇప్పటికే చికిత్సలోకి వచ్చింది. అయితే ఘన కణితులైన ఊపిరితిత్తులు, పాంక్రియాస్, రొమ్ము తదితర క్యాన్సర్లలో కార్ట్ ఇంకా పరిశోధన దశలోనే ఉంది.
కృత్రిమ మేధతో మరింత కచ్చితమైన చికిత్స
క్యాన్సర్ చికిత్సలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర కూడా పెరుగుతోంది. స్కాన్లు, బయాప్సీ, జన్యు సమాచారం, గత వైద్య వివరాలను విశ్లేషించి, ఏ చికిత్సకు రోగి స్పందించే అవకాశం ఎక్కువగా ఉందో అంచనా వేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతోంది.
ఆశలు పెంచుతున్న కొత్త దశ
క్యాన్సర్ చికిత్సలో మార్పు ఒక్కసారిగా రాదు. లక్ష్యిత మందులు, ఏడీసీలు, రేడియో ఫార్మాస్యూటికల్స్ ఇప్పటికే రోగులకు చేరుతున్నాయి. వ్యక్తిగతీకరించిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు తదుపరి కీలక అడుగుగా కనిపిస్తున్నాయి. ఘన కణితులకు కార్ట్ వంటి చికిత్సలు ఆ తర్వాతి దశలోకి రావచ్చు. భవిష్యత్తులో క్యాన్సర్‌కు ఒకే చికిత్స కాకుండా.. రోగి క్యాన్సర్ స్వభావాన్ని బట్టి ప్రత్యేకమైన చికిత్సను ఎంచుకునే దిశగా వైద్యం సాగుతోంది. క్యాన్సర్‌పై పోరాటం ఇంకా కొనసాగుతున్నప్పటికీ కొత్త తరం చికిత్సలు రోగులకు కొత్త ఆశలను కల్పిస్తున్నాయి.

