మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా దర్శకుడు సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో కలాహీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పొలిటికల్ యాక్షన్ డ్రామా 'లెగసీ'.
యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'లెగసీ' అనౌన్స్‌మెంట్ టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగించింది. 'లెగసీ' ఒక ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం చుట్టూ సాగే ఈ కథలో ఒక వారసుడు తాను కోరుకోని ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. తన తండ్రి గతానికి సంబంధించిన దాగి ఉన్న నిజాలను ఎదుర్కొంటూ, శక్తివంతమైన ప్రత్యర్థులతో పోరాడుతూ తనపై పడిన వారసత్వపు భారాన్ని మోసే పరిస్థితిని ఎదుర్కొంటాడు.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఇప్పటివరకు చూడని విభిన్నమైన, శక్తివంతమైన అవతార్‌లో కనిపించనున్నారు. ప్రముఖ నటుడు కే కే మేనన్ అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తుండగా, మురళీ మోహన్ , కె కె మీనన్ , రావు రమేష్, సచిన్ ఖేడేకర్, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, కలెక్టర్ శ్రీనివాస్, రవి కాలే, అమిత్ తివారీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తూ తమ అద్భుతమైన నటనతో సినిమా ప్రపంచానికి మరింత లోతు, వైవిధ్యం, శక్తిని తీసుకొస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. గురువారం నుంచి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు కీలక చిత్రీకరణ జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్‌లో కథకు కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్, పాటలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

