Dailyhunt
లిబియా తీరంలో పడవ మునిగి 80 మందికి పైగా గల్లంతు

లిబియా తీరంలో పడవ మునిగి 80 మందికి పైగా గల్లంతు

లిబియా తీర ప్రాంతం నుంచి బయలుదేరిన ఓ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోవడంతో 80 మందికిపైగా వలసదారులు గల్లంతైనట్లు ఐక్యరాజ్య సమితి వలస సంస్థ (ఐఓఎం) మంగళవారం తెలిపింది.

ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉత్తర పశ్చిమ లిబియాలోని తజౌరా పట్టణం నుంచి సుమారు 120 మంది ప్రయాణికులతో ఈ పడవ బయలుదేరింది. వాతావరణ పరిస్థితులు బాలేకపోవడంతో పడవలోకి నీరు చేరడంతో అది మునిగిపోయినట్లు ఐఓఎం పేర్కొంది. సంఘటన అనంతరం ఒక వాణిజ్య నౌక, టగ్‌బోట్ కలిసి 32 మందిని రక్షించగా, ఇటలీ తీర రక్షక దళం వారిని దక్షిణ ఇటలీలోని లాంపెడూసా దీవికి తరలించింది.

లిబియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి యుద్ధం, పేదరికం నుంచి తప్పించుకునే వలసదారులకు ప్రధాన మార్గంగా మారింది. ఈ ఘటనకు వారం రోజుల ముందే, లాంపెడూసా సమీపంలో మరో పడవను వెలికి తీసింది ఇటలీ తీరరక్షక దళం. ఈ ఘటనలో 58 మందిని రక్షించింది. ఈ ప్రమాదంలో19 మంది చనిపోయారు. మధ్యధరా సముద్రం ద్వారా ఉత్తర ఆఫ్రికా నుంచి యూరప్‌కు చేరే ప్రయత్నంలో లాంపెడూసా దీవి ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉంది. ఈ ప్రమాదకర ప్రయాణంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, ముఖ్యంగా ట్యునీషియా, లిబియా తీరాల నుంచి బయలుదేరే చిన్న పడవలే ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu