Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లోక్ అదాలత్‌లో 1.51లక్షల కేసుల పరిష్కారం

లోక్ అదాలత్‌లో 1.51లక్షల కేసుల పరిష్కారం

సైబర్ మోసాల బాధితులకు రూ.42.28 కోట్ల ఊరట

ఈ ఏడాది ఇప్పటివరకు రూ.139.68 కోట్ల రీఫండ్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12న నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది.

రాజీకి వీలున్న క్రిమినల్ కేసులతో పాటు వివిధ రకాల న్యాయ వివాదాలను పరస్పర అంగీకారం, రాజీ ద్వారా పరిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,51,164 కేసులు పరిష్కరించినట్లు పోలీసు శాఖ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో కోర్టుల్లో పెండింగ్ కేసుల భారం తగ్గడంతో పాటు కక్షిదారుల సమయం, ఖర్చు ఆదా అయ్యాయని పేర్కొంది. లోక్ అదాలత్‌లో భాగంగా 1,47,268 సాధారణ కేసులతో పాటు 3,896 సైబర్ మోసం కేసులను పరిష్కరించారు. సైబర్ మోసాల బాధితులకు రూ.42.28 కోట్లను తిరిగి అందించడం ఈసారి లోక్ అదాలత్‌లో కీలక నిలిచింది.

ఈ నెల 3 నుంచే కేసుల పరిష్కార ప్రక్రియ ప్రారంభం కాగా, 12న ముగిసింది. ఇందులో 21,843 ఎఫ్‌ఐఆర్ కేసులు, 1,404 విపత్తు నిర్వహణ కేసులు, 61,052 ఈ- పెట్టీ కేసులు, 62,969 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులు పరిష్కరించారు. వీటికి అదనంగా 3,896 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించారు. అత్యధిక కేసులను పరిష్కరించిన పోలీసు యూనిట్లలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో 15,944 కేసులు, ఖమ్మంలో 10,955, గద్వాలలో 8,469, వరంగల్‌లో 8,404, మల్కాజిగిరిలో 8,109 కేసులు పరిష్కరించారు.

సైబర్ బాధితులకు భారీ ఊరట

సైబర్ మోసాల బారినపడి డబ్బు కోల్పోయిన వారికి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్‌బి) ప్రత్యేకంగా ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్నాయి. జాతీయ లోక్ అదాలత్‌లో 3,896 మంది సైబర్ బాధితులకు రూ.42.28 కోట్లు రీఫండ్ చేశారు. ఇందులో సైబరాబాద్ అత్యధికంగా 942 మంది బాధితులకు రూ.14.19 కోట్లు తిరిగి అందించింది. రాష్ట్ర సెబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలో 41 మంది బాధితులకు రూ.10.55 కోట్లు, మల్కాజిగిరిలో 1,024 మందికి రూ.5.27 కోట్లు, హైదరాబాద్‌లో 530 మందికి రూ.5.02 కోట్లు, సూర్యాపేటలో 34 మందికి రూ.76 లక్షలు రీఫండ్ అయ్యాయి.

ఏడాదిలో రూ.139.68 కోట్ల రీఫండ్

ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 24,189 మంది సైబర్ క్రైమ్ బాధితులకు రూ.139.68 కోట్లను తిరిగి అందించినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. బాధితుల ఫిర్యాదులపై వేగంగా స్పందించడం, బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ సంస్థలతో సమన్వయం, న్యాయపరమైన సహకారం వంటి చర్యలతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. సైబర్ మోసాల బాధితులకు త్వరగా డబ్బు తిరిగి అందించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన మనీ రీస్టోరేషన్ మాడ్యూల్ (ఎంఆర్‌ఎం)రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో చురుకుగా వినియోగిస్తోంది. ఈ ఏడాది మేలో ప్రారంభమైన ఈ విధానం తెలంగాణలో జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. కొన్ని సందర్భాల్లో కోర్టు ఉత్తర్వులు అవసరం లేకుండానే నిలిపివేసిన నిధులను బాధితులకు తిరిగి అందించే అవకాశం ఉండటంతో రికవరీ ప్రక్రియ వేగవంతమైంది. ఈ నెల 12 నాటికి ఎంఆర్‌ఎం ద్వారా 9,355 మంది బాధితులకు రూ.27.23 కోట్లను రీఫండ్ చేశారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు 73,204 మంది సైబర్ బాధితులకు రూ.514.93 కోట్లను తిరిగి అందించినట్లు అధికారులు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu