దుబాయి: మహిళల ఆసియాకప్ ట్రోఫీని భారత మహిళా క్రికెట్ జట్టు సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 72 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి విజేతగా నిలిచింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన లంక 111 పరుగులకే కుప్పకూలింది. శ్రీచరణి నాలుగు, దీప్తి శర్మ మూడు వికెట్లు తీసి భారత్‌ను గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు శుభారంభం అందించారు.
ఇటు మంధాన అటు షఫాలీ ఎదురు దాడికి దిగడంతో ప్రత్యర్థి టీమ్ బౌలర్లు ఆత్మరక్షణలో పడ్డారు. ఇదే సమయంలో ఇద్దరు కలిసి 77 బంతుల్లోనే తొలి వికెట్‌కు 129 పరుగులు జోడించారు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన షఫాలీ 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేసింది. మంధాన 39 బంతుల్లో 3 సిక్సర్లు, 5 బౌండరీలతో 59 పరుగులు సాధించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేక పోయారు.

