బీర్భూమ్: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టి ముఖర్జీ ఆత్మహత్య చేసుకుంది. బీర్భూమ్ జిల్లా రాంపూర్హట్ ప్రాంతంలోని కుసుంబా గ్రామంలోని తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు.
ఇంటి రెండవ అంతస్తులోని ఒక గదిలో 28 ఏళ్ల బ్రిస్టి మృతదేహం లభించిందని చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం రాంపూర్హట్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రికి తరలించారు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని.. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు,
బ్రిస్టి, మమతా బెనర్జీ కజిన్ నిహార్ ముఖర్జీ కుమార్తె. ఆయన రాంపూర్హట్‌లో తృణమూల్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక, బ్రిస్టి.. స్థానిక పాఠశాలలో 'గ్రూప్ సి' ఉద్యోగిగా పనిచేసేవారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బ్రిస్టి ముఖర్జీ గత కొన్నేళ్లుగా కుంగుబాటు (డిప్రెషన్)తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ-సహాయక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో.. ఆ నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల కారణంగా ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయిందనని వారు తెలిపారు. ముఖర్జీ తన భర్తతో విడాకుల ప్రక్రియను కూడా ఎదుర్కొంటున్నారని.. ఆ కేసు ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని చెప్పారు.

