మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రులకు ఆదివారంనా డు లేఖలు రాశారు.
ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహ ర్ లాల్ ఖట్టర్‌కు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి సిఎం వేర్వేరుగా లేఖలు పంపారు. షరతులు, విధివిధానాలు వెంటనే ఖ రారు చేయాలన్నారు. మెట్రో మొదటి దశ, రెం డో దశ అనుమతులు జాప్యం అవుతున్నాయని, వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని కేంద్ర మం త్రులను సీఎం రేవంత్‌రెడ్డి లేఖల్లో కోరారు. జూన్ 23, 24 తేదీలలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా సిఎం ప్రస్తావించారు.
జూన్ 24వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అ శ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డితో పాల్గొన్న సమావేశాల్లో హైదరాబాద్ మెట్రో ఫేజ్- 1, ఫేజ్ -2 అంశాలపై విస్తృతంగా చర్చించిన విషయాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఆ సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇప్పటికీ అమలులోకి రాకపోవడం పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయని, అందువల్ల అదే సంస్థ ఫేజ్- 2కు అవసరమైన ఆర్థిక నమూనా, దీర్ఘకాలిక రుణాల సమీకరణ, నిధుల సమీకరణ మార్గాలు, ఆర్థిక వ్యూ హం కూడా రూపొందించాలని సమావేశంలో నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఫేజ్ -1 ప్రాజెక్టు విలువ నిర్ధారణ, రు ణాల పునర్వ్యవస్థీకరణ, ఫేజ్- 2 నిధుల సమీకర ణ వంటి అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించేలా టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ (టిఒఆర్) రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియ సమన్వయం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించిందని లేఖలో గుర్తు చేశారు.
కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మెట్రో ఫేజ్- 1 ఆస్తుల విలువను నిర్ధారించడం, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలతో పాటు, ఫేజ్- 2 విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్‌బిఐ క్యాప్స్‌ను నియమించాలని ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ విషయంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్(టిఒఆర్)ను ఖరారు చేయకపోవడం, ఎస్‌బిఐ క్యాప్స్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరగడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జాప్యం వల్ల మెట్రో ఫేజ్ 1 నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయని, అలాగే ఫేజ్- 2 డిపిఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు.
ఫలితంగా ప్రాజెక్టు అమలు మరింత వాయిదా పడటంతో పాటు వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ కూడా ముందుకు సాగడం లేదని సిఎం రేవంత్ రెడ్డి వాపోయారు. దీంతో ప్రాజెక్టు అమలు వాయిదా పడుతుండగా, కాలయాపన కారణంగా నిర్మాణ వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి, ఈ విషయంపై వెంటనే దృష్టి సారించాలని విన్నవించారు. హైదరాబాద్ భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలకు అత్యంత కీలకమైన మెట్రో ఫేజ్- 2 విస్తరణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాకూడదని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఈ విషయంలో ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్‌బిఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. తద్వారా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమలై, మెట్రో ఫేజ్- 1 స్వాధీనం ప్రక్రియ పూర్తికావడంతో పాటు మెట్రో ఫేజ్- 2 విస్తరణ పనులు ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు సాగేందుకు వీలుకలుగుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవలే కేంద్రమంత్రులతో భేటీ అయిన సిఎం
మెట్రో రైలు పెండింగ్ అంశాల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సిఎం రేవంత్ రెడ్డి ఇది వరకే పలుమార్లు లేఖలు రాశారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొద్దిరోజుల క్రితమే ఢిల్లీలోని రైల్ భవన్‌లో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సిఎం రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో రైలు విస్తరణను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి కేంద్రం సహాయం అవసరమని సిఎం వివరించారు. మెట్రో విస్తరణకు నోచుకోకపోవడంతో హైదరాబాద్‌లో నగరంలో ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్రమంత్రి దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. విస్తరణకు సంబంధించిన అన్ని ప్రక్రియలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని, దీనికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి రావాల్సిన రుణాన్ని త్వరగా విడుదలయ్యేలా చొరవ చూపాలని కోరారు.

