Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబై వీధుల్లో వరదలు..చెట్టు కూలి ఒక వ్యక్తి దుర్మరణం

ముంబై వీధుల్లో వరదలు..చెట్టు కూలి ఒక వ్యక్తి దుర్మరణం

వాణిజ్య రాజధాని ముంబై మహానగరం కుండపోత వర్షాలతో ఆదివారం తల్లడిల్లింది. మహారాష్ట్ర అంతటా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ముంబై లో 24 గంటల వ్యవధిలో 300 ఎంఎంల వాన నమోదైంది.

ఎడతెరిపి లేకుండా దంచికొట్టిన వానలతో జనం నానా ఇక్కట్లకు గురయ్యారు. అయితే భారీ వర్షాల క్రమంలో అరేబియా సముద్రంలో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. మెరైన్ డ్రైవ్ వద్దకు భారీ వర్షాలలోనూ జనం తరలివచ్చి, అలలు తరలివచ్చి తీరాన్ని తాకుతున్న దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తూ ఎంజాయ్ చేశారు. దీనితో అధికార యంత్రాంగం వీరిని అక్కడి నుంచి తరలించేందుకు నానా పాట్లు పడాల్సి వచ్చింది. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ విభాగం (ఐఎండి) హెచ్చరించింది. భారీ వర్షాలతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి కొద్ది సేపు విమానాల రాకపోకలు నిలిపివేశారు. ముంబై వీధులన్ని జలమయం అయ్యాయి.

పలు చోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో ఒక చోట చెట్టు దుర్ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా సగటున కొన్ని ప్రాంతాలలో 300 ఎంఎంల మేరకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో నాలుగు ఇండిగో విమానాలను రద్దు చేశారు. ముంబైకి రావాల్సిన దాదాపు 13 విమానాలను వేరే ఎయిర్‌పోర్టులకు దారిమళ్లించారు. ముంబై అంతటా దట్టమైన నల్లటి మబ్బులతో కూడిన చలివాతావరణం కమ్ముకుంది. ఇక ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అదానీ గ్రూప్ , ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో , భీకర గాలులతో , భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. బాంద్రాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కాన్వాయ్ వెళ్లుతుండగా ఓ చెట్టు విరిగి ఓ కారు ముందు పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

నగరంలో కుర్లా వెస్ట్ నౌపాద ప్రాంతంలో .హిందీ బిఎంసి స్కూల్ సమీపంలో వర్షాల ధాటికి ఓ పెద్ద చెట్టు కూలింది. ఈ క్రమంలో అక్కడి యూనస్ కుందావాలా తీవ్రంగా గాయపడి తరువాత ఆసుపత్రిలో చికిత్స దశలో మృతి చెందాడు. భారీ వర్షాల కంటే ముందే ముంబైలో జల్లులతోనే వీధులు వరదలతో బురదమయం కావడం, ఈ క్రమంలో ఇటీవలే ఓ చోట తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి ఓ వ్యక్తి మృతి చెందడం వంటి ఘటనలతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu